పట్టణ ప్రగతిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పురపాలక మంత్రి కె.తారకరామారావు సుడిగాలి పర్యటన చేపట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా.. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అజయ్‌తో కలిసి ఖమ్మం చేరుకొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తగా అభివృద్ధి చేసిన లకారం మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కమాండ్ కంట్రోల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఖమ్మం వాసులకు అంకితం చేశారు. శాంతినగర్ ప్రభుత్వ కళాశాలలో భవన సముదాయాల్ని అందుబాటులోకి తెచ్చారు. పర్యటనలో భాగంగా... ఖమ్మం కాల్వొడ్డులో ఒక్కసారిగా వాహనశ్రేణిని ఆపి అక్కడున్న వీధి వ్యాపారులతో ముచ్చటించారు. పరిశుభ్రత పాటించాలని.. వ్యర్థాలను రోడ్డుపై పడేయొద్దని సూచించారు. అనంతరం పెవిలియన్ మైదానంలో బాస్కెట్ బాల్ స్టేడియంతో పాటు సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు.
ఏప్రిల్ 2న టీఎస్‌బీపాస్ ప్రారంభం
ఖమ్మం సుడిగాలి పర్యటనలో స్థానికులు, వార్డు కమిటీలు, ప్రజాప్రతినిధులతో పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన చర్యలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలంలో నిర్మించిన 60 రెండు పడక గదులు, ఖమ్మం వైయస్సార్ నగర్‌లో నిర్మించిన 240 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించి గృహ ప్రవేశాలు చేయించారు. సామూహికంగా సంఘటిత శక్తితో ముందుకెళ్తే పట్టణ ప్రగతి విజయవంతం కావడం ఖాయమన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని సూచించిన మంత్రి ఏప్రిల్ 2నుంచి టీఎస్‌బీపాస్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
దేశానికి రాష్ట్రం ఆదర్శం
ఖమ్మం పర్యటన తర్వాత ఇల్లెందు పట్టణంలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న విధానాలకు తోడు అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రాష్ట్రం ఆదర్శగా నిలిచిందన్నారు. పర్యటన సందర్భంగా ఇల్లెందులో ఫ్లెక్సీలు పెట్టినందుకు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లుకు రూ. లక్ష జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌కు ఖమ్మం వాసులు అడుగడగునా జననీరాజనం పలికారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన కేటీఆర్.. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు.
ఇదీ చూడండి: బంగాల్పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్