ఖమ్మం సిగలో మరో పర్యాటక మణిహారంగా ఉన్న వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కు... సందర్శకులకు సరికొత్త అనుభూతులు పంచుతోంది. ప్రకృతి రమణీయత కలబోతగా ఉన్న ఈ వనం... నగర వాసులకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారికి వారంతపు విడిది కేంద్రంగా మారింది. నాలుగేళ్లలో అద్భుతమైన పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అటవీశాఖ కృషితో ప్రకృతి ప్రేమికుల మదిదోస్తోంది.
పర్యాటక సొగబులు
నాలుగేళ్ల క్రితం కొద్దిపాటి సౌకర్యాలతో ప్రారంభమైన ప్రకృతివనంలో... క్రమంగా సకల సౌకర్యాలు, ఆధునిక సదుపాయాలను సమకూర్చారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా అటవీశాఖ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. 440 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వెలుగుమట్ల పార్కు ప్రాంతాన్ని... తొలిదఫాగా 100 ఎకరాలు అటవీశాఖ పరిధిలోకి ఇచ్చారు. ప్రస్తుతం 30 ఎకరాల సువిశాల ప్రాంతంలో అనేక పర్యాటక సొగబులు అద్దుకుని ప్రజలకు ఆహ్లాదం పంచుతోంది.
కట్టిపడేస్తున్న సాహస క్రీడలు
పార్కులోని గులాబీవనం అందరి మదిని దోచేస్తోంది. రాశివనం, నక్షత్ర, నవగ్రహ వనాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. పార్కు చుట్టు దాదాపు లక్ష మొక్కలు నాటారు. వీటిలో 100 రకాల ఔషధ మొక్కలున్నాయి. వెలుగుమట్ల ప్రకృతివనంలో చిన్నపిల్లలు రోజంతా ఆడుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటవీప్రాంతాన్నంతా వీక్షించేలా వాట్ టవర్‌ను ఏర్పాటు చేశారు. సాహస క్రీడలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ప్రధాన పర్యటక ప్రాంతాలకే పరిమితమైన వివిధ రకాల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
జిల్లాల నుంచి పర్యటకులు
సువిశాల ప్రాంతంలో మధ్యమధ్యలో ఏర్పాటు చేసిన పగోడాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఓపెన్ జిమ్‌లు, మహిళల కోసం ప్రత్యేక ఆటలు, ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశారు. పర్యటకులు సైక్లింగ్, బ్యాటరీ వాహనాల్లో పార్కును చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఈ పార్కులో మరిన్ని పర్యాటక సొబగులు అద్దేందుకు చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరవాసులకు వెలుగుమట్ల పార్కు సరికొత్త పర్యటక ప్రాంతంగా స్వాగతం పలుకుతోంది. నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి పర్యటకులు ఇక్కడికి వస్తున్నారు.
ఇదీ చదవండి : ఆరోగ్యం.. ఆనందం... ఈ నందనవనం!