నగరపాలక సంస్థలుగా ఉన్న నగరాలను మరింత అభివృద్ధి చేసేందుకు గానూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నూతన నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్లుగా ఉన్న నగరాలను పట్టణాభివృద్ధి సంస్థలుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2017 అక్టోబర్ 24న ఖమ్మం నగరంలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పేరు మీదుగా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఖమ్మం నగరంతోపాటు మొత్తం 7 మండలాల్లోని 47 గ్రామాలు సుడా పరిధిలోకి రానున్నాయి. వీటిలో ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాలు, ఖమ్మం గ్రామీణం, కూసుమంచి, చింతకాని, వైరా, కొణిజర్ల మండలాల్లోని కొన్ని గ్రామాలతో కలిపి సుడా ఏర్పాటు చేశారు.
ఛైర్మన్ పదవికి పోటీ
సుడా ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి రెండేళ్లు కావస్తున్నా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన పాలకవర్గం ఎట్టకేలకు కొలువుదీరేందుకు కసరత్తు సాగుతోంది. సుడా ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కమ్మ సామాజిక వర్గానికి దక్కడం వల్ల... సుడా ఛైర్మన్ పదవిని బీసీకి ఇవ్వాలని తెరాస యోచిస్తోంది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రధాన అనుచరుడు బచ్చు విజయ్ రేసులో ముందువరుసలో ఉండగా... తెరాస నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, ఎంపీ నామ అనుచరురాలు స్వర్ణకుమారి పోటీపడుతున్నారు. ఛైర్మన్గా బచ్చు విజయ్ను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రతిపాదించడం, సీఎం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. సుడా ఏర్పాటుతో ఖమ్మం మహానగరంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సుడాతో వేగంగా అభివృద్ధి
సుడా కొలువుదీరితే ఖమ్మం నగర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ఆదాయం పరంగానూ, అభివృద్ధి పరంగానూ మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. లే అవుట్లు, భవనాల అనుమతుల విషయంలో ప్రణాళికాబద్ధంగా సాగనున్నాయి. సుడా ఏర్పాటు తర్వాత ఖమ్మం నగరంలో, నగరం చుట్టు పక్కల ఎత్తైన నిర్మాణాలు, వెంచర్లకు సుడా అనుమతి తప్పనిసరి కానుంది. భవనాల నిర్మాణ అనుతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన సుడా ద్వారా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: ప్రైవేటుకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులు: కిషన్ రెడ్డి