Thatha Madhu: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించడం సంతోషంగా ఉందని... ఖమ్మం ఎమ్మెల్సీగా విజయం సాధించిన తాత మధు అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో కొంత మేరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. తమకున్న బలం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్‌పై పార్టీలో తప్పకుండా చర్చించుకుంటామని తెలిపారు.
తెరాసను గెలిపించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తాత మధు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తెరాసపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. 12 చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి.
ఈ రోజు ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీ విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఈ విజయం ఖమ్మంలోని నిజమైన కార్యకర్తలది. ఎవరైతే గత నెలరోజులుగా నా విజయం కోసం సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో కలసి పని చేశారో... వారందరికీ పేరుపేరునా చేతులెత్తి నమస్కరిస్తున్నా. నిజానికి నాకున్న బలం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. దీనిపై పార్టీలో తప్పకుండా చర్చించుకుంటాం.- తాత మధు, ఖమ్మం ఎమ్మెల్సీ
ఇదీ చదవండి: TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం