Farmers Compensation problems in Khammam: కోదాడ-కురవి జాతీయ రహదారి కోసం 2018-19లో ప్రభుత్వం భూమి సేకరించింది. కురవి నుంచి వయా ఖమ్మం గ్రామీణం, ముదిగండ, నేలకొండపల్లి మండలాల మీదుగా.. కోదాడ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర అధికారులు భూసేకరణ చేశారు. మూడు మండలాల్లోని సుమారు 600 మంది రైతుల నుంచి 256 ఎకరాలు సేకరించారు. ఎకరాకు 12 లక్షల చొప్పున పరిహారం అందించారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం భూములివ్వగా ఆ మేరకు తొలగించి.. మిగిలిన భూమిని రైతు పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కొంతకాలం తర్వాత జాతీయ రహదారి కోసం ఇచ్చిన భూములతో పాటు మిగిలిన భూములు రైతులకు ఆన్‌లైన్‌లో చూపించలేదు. 2019-20లో రైతుబంధు వచ్చే సమయంలో రైతులు ఆ విషయం గుర్తించారు. ఒక్కో రైతు ఇచ్చిన భూమిని రెండుసార్లు తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదైంది.
భూసేకరణకు ఇచ్చిన భూమితో పాటు మరోసారి అంతే భూమిని తొలగించినట్లు ధరణిలో చూపింది. రైతు ఇచ్చిన భూమికన్నా ఎక్కువ సేకరించినట్లు నమోదు కావడం, ఇచ్చిన భూమి తక్కువ అయితే.. ఎక్కువ ఇచ్చినట్లు చూపించడం, కొందరి రైతుల నుంచి రెండుసార్లు భూమిని తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదయ్యాయి.
జాతీయ రహదారికి ఇచ్చిన భూమి మినహా మిగిలిన భూమి వ్యవసాయేతర భూమిగా నమోదవడం, మరికొంత మంది రైతుల నుంచి గతంలో తీసుకున్న భూమి పక్కనే ఉన్న భూమిని రహదారిలో కలిపేసుకోవడం బాధిత రైతుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. భూమి తమవద్దే ఉన్నా ఆన్‌లైన్‌లో చూపించకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. ధరణిలో సమస్య, అధికారుల నిర్వాకం ఫలితంగా కర్షకులు ఏడాదిగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉన్నతాధికారులను కలిసి పలుమార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో రెండుసార్లు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఆ దిశగా పనులు ముందుకు సాగడం లేదు.
ఇవీ చదవండి: