దశాబ్ధం కిందట ఖమ్మం జిల్లా మధిర మండలంలోని వైరా నదిపై 2010లో రూ.30 కోట్లతో జలిముడి ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి డిప్యూటీ స్పీకర్గా ఉన్న భట్టి విక్రమార్కతో కలిసి అప్పటి జిల్లా మంత్రి దివంగత రామిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడాది వ్యవధిలోనే నిర్మాణం పూర్తయింది.
ప్రాజెక్టు నుంచి రైతుల భూములకు సాగునీరు పారే కుడి, ఎడమ కాల్వలు తవ్వేందుకు రైతుల నుంచి భూములు సేకరించారు. కాల్వల నిర్మాణం పూర్తయి.. ఎడమ, కుడి కాలువ ద్వారా 4,900 ఎకరాలకు అధికారికంగా.. మరో రెండు వేల ఎకరాలకు అనధికారికంగా సాగునీరు అందనుంది.
సాగునీరు అందుతుందనే ఆశతో కాల్వల నిర్మాణం కోసం రైతులు తమ భూముల్లో కొంత భాగాన్ని ఇచ్చారు. నేటికీ వాటి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పరిహారం అందడం లేదని వాపోతున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మాత్రం తన రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించి కోల్పోయిన భూమి కంటే అధిక మొత్తంలో పరిహారం పొందటం కొసమెరుపు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి తమకు రావాల్సిన పరిహారం ఇప్పించాలని బాధిత కర్షకులు కోరుతున్నారు.