ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్ సమీపంలో వట్టికొండ నాగేశ్వరరావు, కోలా గోపి మద్యం తాగుతూ రూ. 50 బెట్టింగ్‌తో లూడో ఆట ఆడారు. వరుసగా నాగేశ్వరరావు రెండుసార్లు గెలిచాడు. మద్యం మత్తులో ఉన్న గోపి ఈసారి రూ.500 పెడదాం అన్నాడు. అందుకు నాగేశ్వరరావు నీకు అంత సీన్ లేదని అనటంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్తా చినికిచినికి గాలివానగా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. గోపి బీర్ సీసా పగలగొట్టి నాగేశ్వరరావును విచక్షణా రహితంగా పొడిచాడు.
నాగేశ్వరరావు పక్కనే దొరికిన కర్రతో గోపిని కొట్టగా స్పృహ తప్పి పడిపోయాడు. గాయాలతో నాగేశ్వరరావు కేకలు వేశాడు. పరిసరాల్లో ఉన్న వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఖమ్మం ఆసుపత్రికి పంపించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. గోపి కుటుంబ సభ్యులు వచ్చి అతడిని తీసుకెళ్లారు. నాగేశ్వరరావు భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కొండలరావు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని మధిర సీఐ వేణుమాధవ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: అగమ్యగోచరంగా చైనా యాప్ల భవితవ్యం