ఖమ్మం జిల్లా రమణగుట్టలో నివాసం ఉంటున్న తన రెండో భార్య జ్యోతిపై ఆమె భర్త రామారావు కత్తితో దాడి చేశాడు. కొబ్బరి బోండాల కత్తితో తలపై వేటు వేశాడు. ఈ ఘటనలో భార్య జ్యోతికి తలపై గాయమైంది.
గమనించిన స్థానికులు క్షతగాత్రురాలిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామారావును పట్టుకుని దేహశుద్ధి చేసి ఖమ్మం రెండో పట్టణ ఠాణాలో అప్పగించారు.
తన భర్త రామారావు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. మొదటి భార్య రామారావు పెట్టే హింస భరించలేక ఇల్లు విడిచి వెళ్లిపోతే తనను రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఇప్పుడు మొదటి భార్య మళ్లీ తిరిగొచ్చిందని పేర్కొంది. తన పేరిట ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాన్ని అల్లుడికి చూపిస్తుంటే.. అకస్మాత్తుగా వచ్చి ఆ ఆస్తులు మొదటి భార్యవని, తిరిగి తమకు ఇచ్చేయాలని.. రామారావు తనపై కత్తితో దాడి చేశాడని బాధితురాలు వాపోయింది.
ఆ ఇళ్లను తన తండ్రి రామారావు అక్రమంగా అమ్ముకునేందుకు యత్నించగా అడ్డుపడినందుకు తన తల్లిపై దాడి చేశాడని బాధితురాలి కూతురు దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇవీ చూడండి: మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!