High Court On Saiganesh Case: భాజపా కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య కేసులో పోలీసులు సమర్పించిన మధ్యంతర నివేదికను పిటిషనర్‌కు అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ న్యాయవాది కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు మధ్యంతర నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
పోలీసులు సమర్పించిన మధ్యంతర నివేదికను పిటిషనర్‌కు ఇవ్వాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. సాయిగణేశ్ అమ్మమ్మ దాఖలు చేసిన మరో పిటిషన్‌తో కలిపి పిల్ విచారణ జరపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ కేసుపై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే కేసులో మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..!: భాజపా మజ్దూర్ యూనియన్ సెల్ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్న గణేశ్ గత నెల 14న ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇవీ చదవండి: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసుపై నిషేధం
చేతిపై రేపిస్ట్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య.. రెండేళ్లుగా మౌనంగా ఏడుస్తూ...