ఖమ్మానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొణిజర్ల వాసులు పిల్లలు చదువుకోసం అందరిలాగానే కార్పోరేట్ వైపు మొగ్గు చూపేవారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొణిజర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుల్లయ్య, మిగతా ఉపాధ్యాయులు ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మెరుగైన విద్యాప్రమాణాలతో పాటు.. వసతుల కల్పన, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతూ కార్పొరేట్ పాఠశాలలకు సవాల్ విసురుతున్నారు.
దేనిలోనూ తక్కువకాదు
పాఠశాలలో విశాలమైన ప్రాంగణం.. భవనాలు ఉన్నాయి. పిల్లల హాజరుశాతం పెంచే దిశగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భవనాలకు ఆకర్షణీయంగా రంగులు వేయించారు. ప్రవాస భారతీయులు, స్థానిక దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చారు. వేలాది పుస్తకాలతో గ్రంథాలయం... పూర్తిస్థాయి పరికరాలతో సామాన్య ప్రయోగశాల, డిజిటల్ తరగతుల ద్వారా బోధన చేపడుతున్నారు. గడిచిన రెండేళ్లుగా అమలు చేస్తున్న వినూత్న బోధన, ప్రత్యేక క్రమశిక్షణకు తల్లిదండ్రులు ఆకర్షితులై పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆటల్లోనూ మేటి
ఆటల్లోనూ ఇక్కడ పిల్లలు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని జూడో క్రీడను ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఆడపిల్లలకు క్రికెట్, యోగా, పిరమిడ్‌లు, ప్రత్యేక రోజుల్లో వాటికి అనుగుణంగా సాంస్క్రతిక ప్రదర్శనలు, సామాజిక కార్యక్రమాలు , నాటికలు ప్రదర్శన.. ఇలా అన్నీ అంశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. హరితహారం, స్వచ్ఛభారత్‌లోనూ స్పూర్తిగా నిలుస్తున్నారు.
దాతల సాయం
దాతల సహకారంతో శుద్ధజల ప్లాంటు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వహణలో ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో చక్కటి బోధన అందిస్తుండటం వల్ల కొణిజర్లతోపాటు చుట్టు ప్రక్కన గ్రామాల నుంచి పిల్లలు వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 400 మంది విద్యనభ్యసిస్తున్నారు.
ఇదీ చూడండి: కొత్త సంఘాలతోనైనా సహకారం అందేనా..?