కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో మహిళా కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు గృహిణిగా ఇంటిపనులు చక్కబెడుతూనే, మరోవైపు బాధ్యత గల ఉద్యోగినిగా విధులకు హాజరవుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎంతోమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. రోజువిడిచి రోజు డ్యూటీలు కేటాయిస్తుండడం వల్ల.. మిగిలిన సమయంలో ఇల్లు, పిల్లలను చక్కదిద్దుకుంటున్నారు. తమ కారణంగా కుటుంబీకులు వైరస్ బారినపడకుండా ఉండేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం మొదటి దశలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసి కాస్త అండగా నిలిచింది. రెండో దశ వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటిని సరఫరా చేయాలని కండక్టర్లు విన్నవిస్తున్నారు. తమకు ప్రోత్సాహాన్నిస్తే మహమ్మారి బారినపడకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తామని చెబుతున్నారు.
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు..
"నాకు ఇద్దరు చిన్నపిల్లలు. వారి వయస్సు 8, 9 సంవత్సరాలు. డ్యూటీ వేసినప్పుడల్లా విధులకు హాజరవుతున్నాను. ఆ సమయంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. ప్రతి రోజు ఎంతోమంది ప్రయాణికులను కలుస్తూ, వారికి టికెట్లు ఇస్తూ విధులు నిర్వర్తిస్తున్నాను. అయినప్పటికీ నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. ఎలాంటి పొరబాటు జరగకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటున్నా. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడకుండా తప్పించుకున్నాను."
-షేక్ జరీనా, ఖమ్మం
రక్షణ చర్యలు తీసుకుంటూనే విధులు:
"లాక్‌డౌన్ సమయంలో రక్షణ చర్యలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నాం. కరోనా రెండో దశ ప్రారంభం నుంచి ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాం. నిత్యం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు చేతులను శానిటేషన్ చేస్తూ ఉంటున్నా. ప్రయాణికులు కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరిస్తున్నారు."
- బి.రాజమణి
నిత్యం అప్రమత్తతోనే విధులు..
"కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ప్రయాణికులు ప్రయాణాలు చేసే సమయంలో కరోనా నిబంధనలు పాటించాలని కోరుతూ వారిని చైతన్యం చేస్తూనే ఉంటున్నాను. బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించేలా వారికి చెబుతున్నా. ఈ విధంగా నిత్యం అప్రమత్తంగా ఉంటూ కరోనా దరిచేరకుండా ఇప్పటివరకు విధులు నిర్వర్తించా. నిత్యం అప్రమత్తతోనే విధులు నిర్వర్తిస్తున్నాను."
- ఇనుపనూరి లక్ష్మి, మధిర
ఒకసారి మహమ్మారిని జయించా..
"మొదటిదశలో మహమ్మారి బారినపడ్డాను. అప్పుడు కూడా విధుల్లో ఉండగానే కరోనా సోకింది. అప్పుడు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నాను. వైద్యుల సలహాల ప్రకారం మందులు వాడి ఎలాగోలా గండం నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు నాకిచ్చిన ధైర్యం, చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేను. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. విధుల నుంచి తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను. పరిశుభ్రంగా శానిటేషన్ పూర్తయిన తర్వాతనే లోపలకు వెళ్తాను."
- కుప్పల ఆదిలక్ష్మి, ఖమ్మం
ఇదీ చూడండి: సంక్షోభంలో చిన్నారులు.. ప్రాథమిక విద్య నేర్పే దారేదీ?