khammam chilli farmers protest: నిన్నటితో పోలిస్తే ధర తగ్గించారని ఆరోపిస్తూ.. ఖమం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు నిరసన చేపట్టారు. సోమవారం క్వింటాల్‌కి 20 వేలు జెండా పాట పెట్టి.... ఇవాళ 16 వేల 500లకు తగ్గించారన్నారు. నిన్నటి ధర ప్రకారమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జెండా పాటను అడ్డుకున్నారు. ధర ఎక్కువగా ఉందని మార్కెట్‌కు వస్తే సరుకు ఎక్కువగా వచ్చిందని ధర తగ్గించారని ఆరోపించారు. మార్కెట్ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. అయితే... ఇద్దరు వ్యాపారులు సోమవారం జెండా పాటకంటే ఎక్కువగా కొనుగోలు చేశారని.. వారిపై చర్యలు తీసుకుంటామని మార్కెట్ యార్డు ఛైర్మన్ తెలిపారు.
సోమవారం రూ.20 వేలకు జెండాపాట అయింది. రేటు బాగుందని మార్కెట్‌కు మిర్చి బస్తాలు తీసుకొచ్చాము. ఇవాళ మార్కెట్లో దళారులు అంతా కుమ్మక్కై జెండాపాట రూ.16,500 చేశారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే.. మాకు నిన్న అవసరం ఉందని చెప్పి ఎక్కువ రేటుకు కొన్నామని అంటున్నారు. ఇప్పుడు అదే 20 వేల రూపాయలకు కొనకపోతే ఈ బస్తాలు తీయము. -రైతు, ఖమ్మం జిల్లా
నిన్న రూ.20 వేలకు పైగా కొన్నారు. రేటు బాగుందని రైతులు పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు. ఇవాళ కూడా అదే రేటుకు కొనుగోలు చేయాలి. ఇంతమంది రైతులను తీసుకొచ్చి మోసం చేశారు. -శేఖర్, కాంగ్రెస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు
నిన్న ఇద్దరు వ్యాపారులు వారి మధ్య పోటీ వల్ల రేటు ఎక్కువ కొనుగోలు చేశారు. దీనివల్ల విభేదాలు తలెత్తాయి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తాం. రైతులకు మాత్రం అన్యాయం జరగకుండా చూస్తాం. జెండా పాట ప్రకారమే అమ్మకాలు జరగాలి. ఇవాళ్టి జెండా పాట రూ.16,500గా ఉంది. - ప్రసన్న లక్ష్మీ, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్
సోమవారం గంటల వ్యవధిలోనే కొనుగోళ్లు...
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా ధర రూ.13,600 పలికింది. సోమవారం విపణికి మొత్తం 800 బస్తాలు రాగా గంట వ్యవధిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిరపకు ఈ సీజన్‌లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ నెల 3న క్వింటాకు గరిష్ఠ ధర రూ.14,650 ఉండగా.. 3 రోజుల వ్యవధిలోనే రూ.3,850 అదనంగా పెరగడం గమనార్హం.
ఇదీ చూడండి: Chilli crop in Khammam: మిర్చిలో చీడపీడల నివారణ మార్గాలు