Nagpur to Amaravati Green Field Highway: నాగ్‌పూర్ నుంచి అమరావతి వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా ముగిసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలం, ఇతర మండలాల రైతులు తరలి వచ్చారు. రఘునాథపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు తమ భూములు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు. తమ భూముల నుంచి జాతీయ రహదారి వెళ్లేందుకు సుముఖంగా లేమని... ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు.
అనంతరం రైతులు.. అధికారుల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మొదటి నుంచి రైతుల అభిప్రాయానికి వ్యతిరేకంగా అధికారుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ప్రచురించని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తప్పుడు నివేదికలు పై అధికారులకు పంపుతున్నారని ఆరోపించారు. కోరవి నుంచి కోదాడ వరకు వేస్తున్న జాతీయ రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చుకోవాలని సూచించారు. తమ భూములు మాత్రం ఇవ్వబోమని.. సారవంతమైన పొలాలను రోడ్డు నిర్మాణానికి వినియోగించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Congress Protest: రిక్షా తొక్కుతూ గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా..