ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో గ్రామానికి చెందిన అంగిరేకుల ఉప్పయ్య(42)కు ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని వరి నాట్లు వేసేందుకు వీలుగా సిద్ధం చేశాడు. ఆదివారం తన పొలంలో నాట్లు వేయాలని పక్కనున్న రైతు పొలంలో ఉన్న బురదగొర్రుని ఎత్తుకొని తన పొలానికి గట్టుపై నడుస్తూ వెళ్తుండగా.. కిందికి జారి ఉన్న విద్యుత్తు తీగలు బురద గొర్రుకి తగిలాయి. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఉప్పయ్యకి భార్య సుభద్ర, ఇద్దరు కుమారులున్నారు.
పొలంలో వేలాడుతున్న తీగలను సరిచేయకుండా విద్యుత్తు శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం కారణంగానే రైతు ప్రాణాలు కోల్పోయాడని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బచ్చోడు విద్యుత్తు కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళన ఆందోళన చేపట్టారు. ఏడీఈ కోటేశ్వరరావు, ఏఎస్సై వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి: రాజస్థాన్: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!