ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరిసర గ్రామ పంచాయతీలను కలుపుతూ ఖమ్మం నగరం పాలక సంస్థగా ఏర్పడింది. ఖమ్మం దానవాయిగూడెం మొదటి నుంచి ఖమ్మం పురపాలక సంఘంలో భాగంగా ఉంది. దానవాయిగూడెం కొత్తకాలనీ ఏర్పడి 15 ఏళ్లకుపైగా అవుతుంది. నగరంలోని పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇంత వరకు కనీసం మౌలిక వసతులు కల్పించటంలో పురపాలిక కానీ, నగర పాలక సంస్థ అధికారులు కానీ అందరూ విఫలమయ్యారు.
సుమారు 3వేల కుటుంబాలు...
సుమారు 3వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాలనీలో 5 వీధులు పూర్తిగా లోతట్టులోనే ఉన్నాయి. ఇక్కడ మురుగు కాల్వలు లేకపోవటంతో ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీరు చాలా లోతులో నిలిచి ఉండటం విశేషం. రోడ్లు లేవు.. వేసినా కనీసం కల్వర్ట్ నిర్మాణం జరగకపోవడం వల్ల నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది.
వానాకాలంలో వలసలే...
వర్షాకాలంలో చాలా మంది తమ నివాసాలు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని తరలించే మార్గం చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా అంతే...
కాలనీలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. గత పదేళ్లుగా నగర పాలక సంస్థ అధికారులకు ఎన్ని సార్లు నివేధించిన సమస్యను పరిష్కరించలేదని స్థానికులు వాపోయారు. వర్షాకాలంలో ఎక్కువగా దోమలు, పాములు కూడా వస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాలకు నోటీసులు ఇస్తే కనీసం తమ స్థలాల్లో మట్టి పోసుకుని నీరు నిల్వకుండా చూసుకుంటారని స్థానికులు స్పష్టం చేశారు.
మొకాల్లోతు బురదలోనే ప్రయాణం...
అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవట్లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. కాలనీలో ఇంత వరకు ఒక్క పక్కా రోడ్డు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు. వర్షం వస్తే రోడ్లన్నీ బురద మయం. మొకాల్లలోతు బురదలో ప్రయాణం చేయాల్సిందే. వాహనాలు వెళ్లేటప్పుడు బురదలో జారి కిందపడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు.
వెంటనే కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి...
ఖమ్మం నగర శివారు ప్రాంతాలు కనీసం అభివృద్ధికి నోచుకోలేదని... వెంటనే కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.