Digital Classes in Khammam Government School : తరగతి గది అంటే నల్లబల్ల, వాటిపై చాక్‌పీసులతో రాస్తూ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అందుకు భిన్నంగా సర్కార్ బడులు డిజిటల్ బాట పడుతున్నాయి. మనబస్తీ-మన బడి పథకంలో భాగంగా ఎంపికైన కొన్ని పాఠశాలల్లో స్మార్ట్ తెరలపై బోధన కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో 115, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 ప్రభుత్వ విద్యాలయాలను ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు స్మార్ట్ తెరలపై బోధన సాగిస్తున్నారు. సందేహాలు నివృత్తి చేస్తూనే.. మరోవైపు గ్రీన్ బోర్డును ఉపయోగించుకుంటున్నారు. అంతర్జాల అనుసంధానం లేకపోయినా.. కొన్నిచోట్ల వైఫై కనెక్షన్.. లేదా మొబైల్ డేటాతో బోధన కొనసాగిస్తున్నారు. విద్యకు సంబంధించిన సమగ్ర విషయాలను యానిమేషన్ చిత్రాల్లో చూపిస్తూ పూర్తి అవగాహన కల్పిస్తున్నారు.
స్టడీ సర్కిళ్లలో డిజిటల్ శిక్షణ.. త్వరలో తరగతుల ప్రారంభం..
ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా నేర్చుకోవడం విద్యార్థులకు, బోధించడం ఉపాధ్యాయులకు సులభతరంగా మారింది. ప్రతి పాఠ్యాంశాన్ని గూగుల్, యూట్యూబ్‌లో శోధన చేసి అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. స్మార్ట్ తరగతుల వల్ల టీచర్లకు బోధనా సమయం ఆదా అవుతోంది.
"ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా బోధించడం చాలా సులభంగా ఉంది. ఈ ప్యానల్స్‌లో గూగుల్, యూట్యూబ్ ద్వారా సంబంధించిన అంశాన్ని విద్యార్థులకు క్లుప్తంగా చెప్పడానికి వీలుంటుంది. ఇలా చెప్పడం వల్ల విద్యార్థులకు కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. పాఠ్య పుస్తకాలలో కేవలం ఫొటోలు చూసి చదవడమే ఉంటుంది. కానీ ప్యానెల్స్ వీడియోలు చూపించడం వల్ల వారికి ప్రతి అంశం చాలా చక్కగా అర్థమవుతుంది. విద్యార్థులు దానిని మరచిపోకుండా ఉంటారు."-ఉపాధ్యాయుడు
విద్యార్థుల సందేహాలను ఆన్‌లైన్‌లో దృశ్యరూపకంగా చూపిస్తూ నివృత్తి చేసే వెసులుబాటు కలిగింది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగయ్యాయని.. మరిన్ని పాఠశాలలకు డిజిటల్ టీచింగ్‌ను విస్తరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
"డిజిటల్ క్లాసులు వినడం వల్ల ప్రతి అంశం చాలా సులభంగా అర్థమవుతుంది. సినిమా చూసినట్టు పాఠాలు నేర్చుకుంటున్నాం. అర్థంకానివి టీచర్లు మళ్లీ మళ్లీ వివరిస్తున్నారు. టీచర్స్ ఏదైనా మిస్ అయినా మేము వీడియోల్లో చూసి నేర్చుకుంటున్నాం. ముందు ఒక అంశం నేర్చుకోడానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు చాలా తొందరగా అర్థమవుతుంది." - విద్యార్థులు
విద్యార్థులు సైతం తరగతి గదిలో పాఠాలు వినడం సినిమా చూసినట్లే ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠం బాగా అర్థం అవుతోందని.. అంతర్జాలంలో యానిమేషన్ చిత్రాల ద్వారా నేర్చుకోవడంతో.. ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటోందని చెబుతున్నారు. విజ్ఞానశాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రం పాఠాలు సులభంగా అవగాహన చేసుకోగలుగుతున్నామని చెబుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైన డిజిటల్ తరగతులు.. ప్రభుత్వ బడుల విద్యార్థులకు అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయుల కృషి... ఒకటి, రెండు తరగతులకూ ఆన్లైన్ పాఠాలు
ఆన్లైన్ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్‌ఫోన్ కొన్నాడు!