ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఎంపీటీసీ రాముపై కారులో వచ్చి కత్తులు, కారంపొడి, గొడ్డలితో దుండగులు హత్యాయత్నం చేయగా ఆయన తప్పించుకున్నారు. నాలుగు నెలలు గడవక ముందే మరోసారి రాముపై ఇల్లందులో రాళ్ల దాడి జరిగింది. ఇందిరానగర్ పంచాయితీకి వెళ్తున్న తనపై గుర్తుతెలియని వ్యక్తులు మార్కెట్ యార్డ్ గోడ వెనక నుంచి రాళ్ల దాడి చేశారని ఈ క్రమంలో తన తలకు గాయం అయిందని రాము తెలిపారు.
గతంలో ఎంపీటీసీ రాముపై దాడి కేసులో ఉండి 48 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చిన పూర్ణ.. ఎంపీటీసీ రాముపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన నివాస ప్రాంత పరిధిలోకి ఎంపీటీసీ రాము కత్తితో దాడి చేశారని.. తాను భయంతో పరిగెత్తానని తెలిపాడు. అయితే ఈ క్రమంలోనే రాము కింద పడి తలకు గాయం చేసుకున్నాడని.. తనపై దాడి చేసింది కాకుండా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని మార్చి చెబుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాడుల ఫిర్యాదుల విధానం ఈ విధంగా ఉండగా ఈ వ్యవహారం రాజకీయ అంశంగా మారింది. జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అనుచరుడైన ఎంపీటీసీ రాము... తనపై దాడి చేసిన వారికి ఎమ్మెల్యే హరిప్రియ అండ ఉందని ఆరోపించారు. తాను రెండో సారి ఎంపీటీసీగా అధికార పార్టీ నుంచి గెలిచినప్పటికీ తనపై దాడులు జరుగుతున్నాయన్నారు. తనపై హత్యాయత్నం చేసిన వారందరూ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారని.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అయితే ఎమ్మల్యేతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
ఈ ఆరోపణలతో తెరాసలో మరోసారి జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కాగా పరస్పర ఫిర్యాదులు నేపథ్యంలో సీఐ వేణు చందర్, ఎస్సై రవి దాడి జరిగిన స్థలాలను పరిశీలించి విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు