CM KCR Speech at Paleru Meeting : తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం గులాబీ జెండా ఎత్తానని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించినప్పుడు కొందరు నవ్వారని గుర్తు చేసుకున్నారు. బక్క పలచని వ్యక్తి ఏం చేస్తారని అవహేళన చేశారన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఒక దశలో మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం నిరాహార దీక్షకు దిగితే తనను ఖమ్మం జైలులోనే పెట్టారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎన్నికల వేళ.. పార్టీల వైఖరిని పరిశీలించి ప్రజలు ఓట్లు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మి ఓటు వేయొద్దని హితవు పలికారు. డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వారికి అవకాశం ఇవ్వొద్దన్నారు. రాష్ట్ర సంపద పెరుగుతున్నా కొద్దీ.. సంక్షేమ పథకాలు పెంచుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఏ పాలకులూ రైతులకు రూపాయి ఇవ్వలేదన్న కేసీఆర్.. రైతుబంధు పథకం తెచ్చి అన్నదాతలకు ఎదురు డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. కర్షకుల బాధలు తనకు తెలుసని.. అందుకే రైతుబంధు తెచ్చానని వెల్లడించారు. ధాన్యం దిగుబడిలో పంజాబ్ తర్వాత స్థానానికి చేరుకున్నామన్నారు.
ఈ క్రమంలోనే సీతారామా ప్రాజెక్టు పూర్తయితే.. ఖమ్మం జిల్లాలో కరవు అనేదే ఉండదని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు ఉండాలో వద్దో.. ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. రైతు బంధు, కరెంట్ వద్దు అనే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారని.. డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనుకునే వారికి బుద్ధి చెప్పాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే తుమ్మల నాగేశ్వర్‌రావు పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. స్నేహితుడనే ఉద్దేశంతో ఓడిపోయిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇచ్చానన్నారు. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేశారో.. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందో ఆలోచించాలన్నారు. అహంకారపూరితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
రైతుబంధు ఉండాలో.. వద్దో.. ప్రజలు నిర్ణయించుకోవాలి. రైతుబంధు, కరెంటు వద్దు అనే కాంగ్రెస్‌ను ఓడించాలి. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారు. డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనుకునే వారికి బుద్ధి చెప్పాలి. తుమ్మల నాగేశ్వర్‌రావు అజయ్ చేతిలో ఓడిపోయినా.. స్నేహితుడనే ఉద్దేశంతో పిలిచి మంత్రి పదవి ఇచ్చాను. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేశారో.. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందో ఆలోచించాలి. - కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి
పాలేరు నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. దశల వారీగా అందరికీ దళితబంధు వర్తింపజేస్తామన్నారు. అహంకారపూరితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలన్న కేసీఆర్.. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తామన్నారు. 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా అమలు చేస్తామని.. కేంద్రం పెంచిన గ్యాస్ ధర భారం భరించి.. రూ.400కే సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు.