CM KCR Public Meeting Today : మూడోసారి అధికారమే లక్ష్యంగా గులాబీదళం రాష్ట్రంలో ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఓ వైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా.. అటు అధినేత రోజుకు రెండు మూడు బహిరంగ సభలకు హాజరవుతూ.. పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. సత్తుపల్లి, ఇల్లందులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ(CM KCR Khammam Public Meeting)లకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ కల్లూరుకు చేరుకుంటారు.
CM KCR Praja Ashirvada Sabha in Sathupalli : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు(BRS Meeting Arrangements) చేశారు. సభకు భారీ జనసమీకరణ ద్వారా సత్తాచాటేలా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగాణాల్లో కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో ప్రచారసభ అనంతరం మరోసారి ఎన్నికల సభకు కేసీఆర్ హాజరవుతుండటంతో నియోజకవర్గానికి ప్రకటించబోయే హామీల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"నామినేషన్ల ముందు జరుగుతున్న సీఎం కేసీఆర్ సభకు భారీగా ఏర్పాటు చేశాం. సుమారు 5 మండలాలు నుంచి జనం వస్తారని ఆశిస్తున్నాం. పార్కింగ్ సదుపాయం కూడా 500 మీటర్లు మించకుండా ఏర్పాటు చేశాం." - సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి
Praja Ashirvada Sabha in Yellandu : సత్తుపల్లి బహిరంగసభ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో ఇల్లెందుకు చేరుకుంటారు. ఈ సభకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఇల్లెందు మండలం సుదిమళ్ల స్టేజీ సమీపంలోని బొజ్జాయిగూడెం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 20 ఎకరాల్లో బహిరంగసభకు ఏర్పాట్లు చేయగా.. ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల నుంచి భారీగా కార్యకర్తలను తరలించేలా ఏర్పాటు చేశారు.
CM KCR Public Meeting Arrangements in Khammam : సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగసభలకు పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది. కల్లూరు సభ ప్రాంగణాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణువారియార్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లెందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు.