రాష్ట్రంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోంటే తెరాస ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని భట్టి ఆకస్మికంగా సందర్శించారు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను.. వేరే ప్రాంతానికి డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం చూస్తేనే... ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు.
తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న మధిర ఆసుపత్రిలో ఇప్పటికే వైద్యుల కొరత ఉందని... ఉన్న వైద్యులు కూడా వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని భట్టి ప్రశ్నించారు. మధిరలో ఐసోలేషన్ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. టీకాల కార్యక్రమంలో మరింత వేగవంతం చేసి ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.