కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల ముఖాముఖి సదస్సు ఖమ్మం జిల్లా తల్లాడలో నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో రైతుల సమస్యలపై ముఖాముఖిలో చర్చించారు. కార్పొరేట్ల కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు. కొత్త చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని తెలిపారు.
కేంద్రం ఆదేశాలతోనే :
కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేశారని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాలు చేపట్టటానికి రైతులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. పట్టపగలే ప్రశ్నించే గొంతుకలైన హైకోర్టు లాయర్లను హత్య చేయటం దుర్మార్గమైన చర్యగా వర్ణించారు.
సీఎం కేసీఆర్ పేదలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోలేదని.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు ఎడవల్లి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్, మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మిర్చి రైతులను కలిసిన నేతలు
రైతులకు నష్టం కలిగించే నల్ల రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో కాంగ్రెస్ నేతలతో కలిసి మిర్చి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.
కొత్త వ్యవసాయ చట్టాలు దేశంలోని బడాబాబుల కోసమే తెచ్చిన చట్టాలే తప్ప రైతుల కోసం తెచ్చినవి కాదు. చట్టాలు అమలైతే రైతులందరూ వాచ్‌మెన్‌గా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మేమందరం అడిగేది ఒక్కటే జై జవాన్ -జై కిసాన్ అనే నినాదంతో ముందుకు రావాలి. అందరినీ ఏకం చేసి ఉద్యమం సాగించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే వ్యవసాయం చేయలేని పరిస్థితి వస్తుంది. భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత