ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 8 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. మార్చి 29 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వేడుకలను బహిరంగంగా కాకుండా ఆలయంలోనే ఘనంగా చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం ఉగాది పండుగతో పాటు శ్రీరామనవమిని రద్దు చేసినా.. నిత్య పూజలను యథాతథంగా నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 1న ఎదుర్కోళ్లు ఉత్సవం:
ఈనెల 29న సమస్త మంగళవాయిద్యాలతో గోదావరి జలాలను తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 30న గరుడాద్రివాస పూజ నిర్వహించి.. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజ పటాన్ని లిఖిస్తారు. అలాగే మార్చి 31నవ అగ్ని ప్రతిష్ఠ దేవత ఆహ్వానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఎదుర్కోళ్లు మహోత్సవం చేపడతారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరువారాధన నిర్వహిస్తారు. సీతా రాముల వారి గుణ శీలాలనూ వివరిస్తూ వైదిక పెద్దలు చేసే సంవాదం మంత్రముగ్ధులను చేస్తుంది.
కరోనా కారణంగా భక్తులు లేకుండానే..
ఏప్రిల్ 2న శ్రీ రామ నవమి రోజు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరపనున్నారు. ఏప్రిల్ 4న వేద పండితులు సీతారాములకు వేద ఆశీర్వచనం అందిస్తారు. ఏప్రిల్ 5న దొంగల దోపు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న ఉంజల్ సేవ వైభవంగా జరుగుతుంది. ఏప్రిల్ 7న సీతారాములకు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజైన ఏప్రిల్ 8న గోదావరి నదిలో సుదర్శన చక్రానికి చక్ర స్నానం చేయించి బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి పలుకుతారు.
అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయంలోపల నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల నడుమ జరిగే ఈ ఉత్సవాలు భక్తులు ఎవరూ లేకుండా ఆలయంలోని బేడా మండపంలో నిర్వహించనున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించాలని కోరారు.
ఇదీ చూడండి: కరోనాకన్నా మనకు పెద్ద శత్రువులు వాళ్లే!