ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భైంసాలో దాడుల పరంపర కొనసాగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరిగిన దాడులపై సీఎం స్పందించకపోవడంపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన ఖమ్మంలో పర్యటించారు.
ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి ఈఆర్ఆర్ గార్డెన్ వరకు భాజపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. జరిపిన బహిరంగ సభలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. భైంసాను కాపాడుకునేందుకు ప్రతీ హిందువును అక్కడికి తరలిస్తామన్న సంజయ్.. తాను త్వరలోనే భైంసా భరోసా యాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఖమ్మంలో అవినీతి తారాస్థాయికి చేరిందని.. బెదిరింపులకు పాల్పడుతున్న మంత్రిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బండి సంజయ్ సమక్షంలో స్తంభాద్రి బ్యాంకు ఛైర్మన్ ఎర్నేని రామారావు భాజపాలో చేరారు.
ఇదీ చూడండి : సిరా, స్కెచ్ పెన్నుల కోసం రూ.10 లక్షలు