ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చిలుకూరు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు కరోనా బారిన పడింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలోనే గత పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఈ వృద్ధురాలికి కరోనా సోకింది. వృద్ధురాలిని మూడు రోజుల కిందట మధిర ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ చికిత్స అనంతరం ఇంటికి తీసుకు వచ్చారు. దీంతో కుమార్తె అల్లుడికి కూడా కరోనా సోకింది.
అయితే మరో ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వృద్ధురాలు ఇంటి వైపు బంధువులు, కుమార్తెలు, కుమారులు ఎవరూ కన్నెత్తి చూడలేదు. దీంతో ఆమెకు మూడు రోజులుగా ఆహారం పెట్టే వారు కూడా లేక ప్రాణాలు విడిచింది. చివరకు మృతిచెందిన విషయం తెలిసిన తరువాత కూడా కడుపున పుట్టిన వారు ఎవరూ అటువైపు వెళ్లలేదు.
కరోనాతో మృతిచెందిన ఆ వృద్ధురాలి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఎవరూ రావట్లేదని తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఫౌండేషన్‌కు చెందిన దోర్నాల రామకృష్ణ, నిస్సీ హరిణి, మునుగోటి నరసింహరావు, ఊర్ల అవినాష్.. వృద్ధురాలి మృతదేహానికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామీణ ఎస్సై లవణ్ కుమార్, సర్పంచ్ నిడమానూరు సంధ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం