Amit Shah Attends BJP Public Meeting in Khammam : రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం తన వ్యూహాన్ని రెడీ చేసుకుంటోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఎలాగైనా ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇకపోతే కాంగ్రెస్ సైతం తెలంగాణ గద్దెపై తమ జెండాని ఎగురవేయాలని చూస్తోంది.
BJP Public Meeting In Khammam : ముఖ్యంగా బీజేపీ.. కేసీఆర్ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తన వ్యూహాన్ని ఇప్పటికే రచించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Amit Shah Telangana Tour Schedule : మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట.. తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా.. బీజేపీ భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. ఈ బహిరంగ సభలకు అన్ని వర్గాల ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్న బీజేపీ.. తొలి సభను ఖమ్మం వేదికగా నిర్వహిస్తోంది. రెండో బహిరంగ సభ నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్నారు. మూడో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కసరత్తులు చేస్తున్నారు.
Schedule of Amit Shah Telangana Tour : తొలి బహిరంగ సభను ఖమ్మం గడ్డపై నిర్వహించాలని బీజేపీ నిర్ణయించడంతో పాటు.. సభకు ముఖ్యఅతిథిగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ రాత్రికే అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు. గురువారం సాయంత్రం అమిత్ షా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఖమ్మం పర్యటనకు అమిత్ షా రావడం ఇదే ప్రథమం కావడంతో.. పార్టీ శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Amit Shah Visits Telangana On June 15th : పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ విజయవంతానికి కమలం నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం లక్ష మందిని సమీకరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు.. మొత్తం ఐదుగురు బాధ్యుల్ని నియమించి సన్నాహక సమావేశాలు, కార్యకర్తల సమీకరణ చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాస్థాయిలో నాలుగు సార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించి జిల్లా నాయత్వానికి రాష్ట్ర పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా యువతను పెద్దఎత్తున తరలించడం ద్వారా భవిష్యత్ బీజేపీదే అన్న సంకేతాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో యువతను కదిలించేలా ప్రణాళికలు చేస్తున్నారు. బహిరంగ సభ ద్వారా ఖమ్మం జిల్లాలో సత్తా చాటడంతో పాటు.. కమలం పార్టీకి జిల్లాలో స్థానం లేదన్న వ్యాఖ్యలు తిప్పికొట్టాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి: