ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపెవరిదో నేడు తేలనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలై.. సాయంత్రం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. బ్యాలెట్ ద్వారా ఈసారి ఎన్నికలు నిర్వహించడంతో లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ ఆంక్షలు అమలు చేయాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. నగరంలోని ఎస్.ఆర్.అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం దాదాపు 200 మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. మొత్తం 60 డివిజన్లకు గానూ 10వ డివిజన్ను తెరాస ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో.. మిగిలిన 59 డివిజన్ల ఫలితాలు నేడు తేలనున్నాయి.
గత నెల ఏప్రిల్ 30న కార్పొరేషన్ పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి ఒక్క ఖమ్మం నగరంలోనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కొవిడ్ దృష్ట్యా పోలింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా మారిందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది.