ఖమ్మం మూడోపట్టణ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఓ గుడిసెలో నలుగురు బిడ్డలతో ఓ మహిళ దీనస్థితిలో కాలం వెళ్లబుచ్చుతోంది. నలుగురు చిన్నారులకు కడుపు నిండా తిండి పెట్టలేక... అనారోగ్య కారణంగా పని చేయలేక.. ఆపన్నుల సాయం అర్థిస్తోంది.
నల్గొండ జిల్లాకు చెందిన వీరలక్ష్మికి ఖమ్మం ప్రాంతానికి చెందిన యువకుడితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. పుట్టింటి వారు, అత్తింటి వారు నిరుపేదలే. 16 ఏళ్లకే వీరలక్ష్మికి పెళ్లి చేశారు. నలుగురు ఆడపిల్లల తల్లి అయిన ఆమె.. ఈ మధ్యనే తీవ్ర అనారోగ్యం పాలైంది. తన కష్టాన్ని చెప్పుకుందామంటే తల్లదండ్రులు గతంలోనే కన్నుమూశారు. కట్టుకున్నవాడు మద్యానికి బానిసయ్యాడు. నలుగురు పిల్లలతో తలదాచుకోడానికి చిన్న గుడిసె కూడా లేదు. ఆకలవుతుందమ్మా అంటున్న పిల్లలను ఏమని సముదాయించాలో తెలియక.. దేవుడా..! ఎందుకయ్యా ఇన్నికష్టాలని మొరపెట్టుకున్న క్షణాలు లెక్కలేనన్ని.
పెళ్లైన నాటి నుంచి ఏనాడు కూలీ మానేది కాదు. కష్టం చేసిన డబ్బులతోనే పిల్లలను పోషించుకునేది. వీరలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మంచం పట్టింది. వైద్యం చేయించుకోడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆమె కష్టాన్ని చూసి ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. ఆ సమయంలో ఆకలితో అలమటిస్తున్న నలుగురు పిల్లలకు స్థానికులే రోజుకొకరు చొప్పున భోజనం పెట్టారు.
వర్షమొస్తే జాగారమే..
స్థానికంగా ఓ గుడిసెలో నలుగురు బిడ్డలతో కాలం నెట్టుకొస్తోంది వీరలక్ష్మి. ఇటీవల కురిసిన వర్షాలకు గుడిసె కూలిపోయినా దానిలోనే తలదాచుకుంటుంది. వర్షమొస్తే పైటకొంగునే బిడ్డలకు గొడుగుగా పట్టి.. వర్షం తగ్గాలని ఎన్ని సార్లు దేవున్ని ప్రార్థించిందో ఆమెకే తెలుసు.
కన్నబిడ్డల పోషణ భారమైన వీరలక్ష్మి కఠిక దారిద్య్రాన్ని చూసి కష్టాలు కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి. తనను, తన నలుగురు ఆడపిల్లల్ని ఆదుకోవాలని ఆపన్నహస్తం కోసం చేతులు జోడించి వేడుకుంటోంది. నా అన్న వారి చేయూత లేక, పిల్లలను పోషించుకునే స్తోమత లేని తన దయనీయతను చూసి ప్రభుత్వం స్పందించి రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని వీరలక్ష్మి వేడుకుంటోంది. మానవతావాదులు స్పందించి తన పిల్లల పోషణకు చేయూతనివ్వాలని దీనంగా అర్థిస్తోంది.
ఇదీ చూడండి: Love marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. కరోనా అడ్డుకున్నా ఒక్కటైంది.!