రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరు వలసొచ్చారు. తమ ఆశలన్నీ తొమ్మిదేళ్ల కూతురుపైనే పెట్టుకుని బతుకుతున్నారు. అందరి పిల్లల్లాగే తమ బిడ్డను కూడా పెద్ద చదువులు చదివించాలని కలలుగన్నారు. సర్కారు హాస్టల్లో సీటొచ్చిందని సంబరపడిపోయారు. కానీ మాయదారి వసతిగృహం తమ బిడ్డను పొట్టన పెట్టుకుంటుందని ఊహించలేక పోయారు. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన బాలిక తల్లి ఆస్పత్రి ప్రాంగణంలో బిడ్డ కోసం పడిన హృదయ వేదన అందరిచేత కంటతడి పెట్టించింది.
ఆశల సౌధం కూలిపోయింది
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంకు చెందిన బరపటి సంజీవ, లక్ష్మీ దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట ఖమ్మం వలస వచ్చారు. తమ కుమార్తె స్పందనకు ప్రభుత్వ వసతి గృహంలో సీటు రావడం వల్ల అందులో చేర్చారు. చక్కగా చదువుతున్న చిన్నారి విద్యుత్ ప్రమాదంలో కడతేరిపోతోందని ఊహించలేకపోయారు.
నాబిడ్డే ఎలా...
ఆదివారం రాత్రి వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాలిక మృతిచెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా విద్యార్థినుల దగ్గరకెళ్లి తన కూతురు ఏదంటూ ఆ తల్లి పడిన రోదన చూపరుల హృదయాల్ని కలిచివేసింది. అప్పటి వరకూ తమతో ఉన్న స్నేహితురాలు దూరమవడం మిగతా చిన్నారులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
విచారణ కమిటీ ఏర్పాటు
ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. నలుగురు సభ్యుల కమిటీ నియమించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేసియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
ఇదీ చూడండి: 2020 నాటికి సున్నా స్థాయికి భూగర్భజలాలు