Boy suicide post: తన ఆత్మహత్యకు అనుమతించాలని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఓ బాలుడు(17) అధికారులకు, పాలకులకు విన్నవిస్తూ పెట్టిన పోస్టు ఆదివారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జి.జగదీశ్‌రెడ్డి, ఖమ్మం, సూర్యాపేట కలెక్టర్లకు ఈ విషయం విన్నవిస్తున్నట్లు పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చేరే వరకు దీన్ని షేర్ చేయాలని కోరారు.
ఆ బాలుడి తల్లి నేలకొండపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ గతేడాది కొవిడ్ బారిన పడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కుమార్తె ఉండటంతో అక్కడికి వెళ్లి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పటి నుంచి బాలుడు అక్క వద్దే ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం పాల్వంచలోని బంధువుల వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత నేలకొండపల్లి వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.
తన అక్క, బావ సరైన వైద్యం ఇప్పించకుండా తల్లి మరణానికి కారణమయ్యారని, తల్లి ఉద్యోగం అక్కకు రావాలనే ఉద్దేశంతో తనను కూడా చంపాలని చూస్తున్నారని అతడు ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపణలను ఖండిస్తూ అతని అక్క ఓ ప్రకటన విడుదల చేశారు. కావాలనే కొందరు తన తమ్ముణ్ని అడ్డు పెట్టుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన తమ్ముడి పోస్టుపై హుజూర్‌నగర్, నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.