Youth Groups protest Against MLA Rasamai: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు రెండు వరుసల బీటీ రోడ్డు వేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని యువజన నాయకులు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సీఐ శశిధర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని యువకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
అంతలోనే యువజనులకు సంపూర్ణ మద్దతు పలికేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చేరుకున్నారు. స్థానికేతరుడైన రసమయి బాలకిషన్ తెలంగాణ ఉద్యమం పేరుతో మానకొండూరు నియోజకవర్గంలో గెలిచి అభివృద్ధిపై ప్రశ్నిస్తే.. పోలీసుల సాయంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి మండలం బేగంపేటలో కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా.. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
దానితో పోలీసులు లాఠీఛార్జీ చేసి.. ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి బాగానే ఉందని.. దానిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు.
ఇవీ చదవండి: