రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election).. అభ్యర్థుల మధ్య పోరు పోటాపోటీగా ఉంది (Huzurabad by-election). బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ.. ముగ్గురే అన్నట్టుగా ఉంది. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసి అనుభవం ఉన్న ఈటల రాజేందర్‌తో (etela rajendar) తలపడుతున్న ప్రత్యర్థులు ఇద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి అడుగు పెట్టిన వారు కావడం గమనార్హం.
ఈటల రాజేందర్ ప్రస్థానం…
2002లో ఉద్యమ ప్రస్థానంలోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్.. తెరాసతో మమేకమై పనిచేశారు. 2004 నుంచి జనరల్, ఉప ఎన్నికల్లో ఆరు సార్లు కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంపై తిరుగులేని పట్టున్న ఈటల మరోసారి ప్రతికూల రాజకీయ పరిస్థితుల మధ్య సెంటిమెంట్‌తో తన పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ ఈటల తన ప్రభావాన్ని తగ్గించుకోకుండా పావులు కదుపుతున్నారు.
ఓటు బ్యాంకు ఎక్కడ ఉంటుంది, ఏ ఓటర్లను ఎలా మల్చుకోవాలి అన్న విషయంపై అనుభవం గడించిన రాజేందర్.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయిదు నెలలకు పైగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఏడోసారి చట్ట సభలోకి అడుగు పెట్టాలన్న యోచనతో ప్రత్యర్థులకు చిక్కకుండా స్కెచ్‌లు గీస్తూ ముందుకు సాగుతున్నారు. భాజపా తరఫున బరిలోకి దిగిన ఈటల.. జాతీయ పార్టీ బలం తనకు మరింత తోడవుతుందని అంచనా వేస్తున్నారు.
గెల్లు ప్రస్థానం కూడా అక్కడి నుంచే
హుజూరాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election) అధికార తెరాస తరఫున (trs candidate) బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస్ (gellu Srinivas yadav) ప్రస్థానం కూడా ఉద్యమాల్లోంచే పుట్టింది. ఉస్మానియా వేదికగా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పీజీ, ఎల్ఎల్బీ పూర్తి చేసి రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ విద్యార్థిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి కూడా ఉస్మానియా విద్యార్థిని... ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.
వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోనే చాలా కాలంగా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా నియోజకవర్గంలో వస్తున్న మార్పులను అంచనా వేసుకొని నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్‌ను కొంత తయారు చేసుకున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఓడించాలని తహతహలాడుతున్నారు. కొంతకాలంగా ఈటలకు, గెల్లుకు మధ్య అభిప్రాయ బేధాలు ఉండడంతో గెల్లు అధినాయకత్వం అండదండలతో పార్టీలో కొనసాగుతున్నారు. తన సొంత ఇమేజ్ కన్నా పార్టీ ఇమేజ్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. నియోజకవర్గంలో బీసీ కార్డును ఉపయోగించి సక్సెస్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.
విద్యార్థి నాయకుని నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి...
కరీంనగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన బల్మూరి వెంకట్ (venkat) కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటి సారి అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. అయితే అనూహ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా (congress mla candidate) బరిలోకి దిగే అవకాశం లభించడంతో వెంకట్... ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పటికీ పార్టీ బలంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు హుజూరాబాద్‌తో ఉన్న అనుబంధాలను ఆసరాగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్ది ఇమేజ్‌తో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, ప్రధాన పార్టీల మధ్య కొట్లాట తనకు తోడవుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఇద్దరూ విద్యార్థి నాయకులే...
తెరాస, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ కూడా విద్యార్థి విభాగాల రాష్ట్ర అధ్యక్షులే కావడం విశేషం (student union leaders). తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గెల్లు శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్న బల్మూరి వెంకట్... ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగడం ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఒకే చోట ప్రత్యర్థులుగా పోటీ చేయడం అత్యంత అరుదుగా ఉంటుంది. హుజూరాబాద్ ఉపపోరులో బరిలో ఉన్న కాంగ్రెస్, తెరాస అభ్యర్థులు ఇద్దరూ విద్యార్థి విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులు కావడం విశేషం.
ఎవరికి పట్టం కడతారో..!
ఇద్దరూ బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు కాగా... ఒకరు ఫార్వర్డ్ క్యాస్ట్‌కు చెందిన వారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ భాజపా అభ్యర్థిగా.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది మాత్రం ఆసక్తిగా మారింది.
ఇదీ చూడండి: Huzurabad by Election: హుజూరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ.. చెమటోడుస్తున్న అభ్యర్థులు... భారీగా పైసలు!