కరీంనగర్లో ఆదివారం ఉదయం జరిగిన కారు ప్రమాదం తర్వాత... అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కరీంనగర్ కమాన్ వద్ద ఫుట్‌పాత్‌పై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పాల్గొన్నారు. పుట్‌పాత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగంగా రోడ్లు, పుట్‌పాత్‌లను విశాలంగా నిర్మించినట్లు మంత్రి తెలిపారు. నడవడానికే పుట్‌పాత్‌లను వినియోగించుకోవాలని సూచించారు. పుట్‌పాత్‌లను ఆక్రమించుకోవడం వల్లనే కరీంనగర్లో కమాన్ వద్ద ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేసారు. కొందరు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఇతరులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని.. వెంటనే పుట్‌పాత్‌లను ఖాళీచేయాలని సూచించారు. నగరపాలక సంస్థ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో తనిఖీ బృందాలను ఏర్పాటుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు.
మంత్రితో సమావేశం అనంతరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ఆక్రమణలను గుర్తించి తొలగించారు. అలుగునూర్, గీతభవన్, రామ్‌నగర్‌లోని ఆయుష్ ఆస్పత్రి, ఎస్ఆర్ఆర్ కాలేజ్, ఆదర్శనగర్, క్లాక్ టవర్ సహా ప్రధాన రోడ్ల వెంట పుట్‌పాత్‌లను సీపీ సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఇదీచూడండి: