హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం(Huzurabad by election campaign 2021 ) రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. ఓ వైపు అగ్రనాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ.. ప్రచారంలో జోరు సాగిస్తుంటే.. మరోవైపు స్థానిక నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అప్పుడప్పుడు గాడి తప్పుతున్నారు. తాజాగా తెరాస నేత తమ పార్టీకి ఓటు వేయకపోతే పింఛను నిలిపివేస్తామని బహిరంగంగా ఓటర్లను హెచ్చరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో(Huzurabad by election campaign 2021 )ని ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో.. దివ్యాంగులు కార్పొరేషన్ ఛైర్మన్ కేతిరి వాసుదేవ రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో సమావేశమయ్యారు. ఉపఎన్నికలో తెరాసకే ఓట్లు వేయాలని అడిగారు. ఈ క్రమంలోనే ఆయన మాట జారారు.
"చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు. మీరు తెరాసకు ఓటు వేయకపోతే మీ పింఛన్లు నిలిపివేస్తాం. అన్ని గ్రామాల్లో తెరాస సర్పంచులే ఉన్నారు. ఓటు వేయని వారి వివరాలు తెలుసుకుని వారికి పింఛన్లు నిలిపివేస్తాం. అవసరానికి మీకు రూ.2000, రూ.3000 పింఛన్లు ఇస్తున్న తెరాసకు ఓటు వేయకపోతే మీకు పింఛన్లు ఎందుకు ఇవ్వాలి. కచ్చితంగా పింఛను తీసుకోవాలనుకుంటే తెరాసకు ఓటు వేయాల్సిందే. ఎవరికి ఓటు వేశారో మేం తెలుసుకోగలం."
- కేతిరి వాసుదేవ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇలా ఓటర్లను బెదిరించిన వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారంతా ఆ నాయకుడిపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు తెరాస మద్దతుదారులు కొందరు ఆయన చెప్పింది నిజమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.