మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెరాసకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా హుజురాబాద్ ఉపఎన్నిక(huzurabad by election 2021) వచ్చింది. భూకబ్జా ఆరోపణలు.. పార్టీలో పొమ్మన లేక పొగపెట్టడం వల్ల తెరాస నుంచి బయటకు వచ్చానని ఈటల ప్రకటించారు. భాజపాలో చేరి తెరాసకు సవాల్ విసిరారు. హుజురాబాద్(huzurabad by election 2021)లో విజయంపై ధీమాగా ఉన్న ఈటల.. నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే పాదయాత్రతో పాటు ప్రజల దీవెనలు పొందేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెరాసలో తనకు జరిగిన అన్యాయం, తెలంగాణ ఉద్యమకాలంలో తాను చేసిన పోరాటాన్ని వివరిస్తున్నారు. అధికార పార్టీలో తనను ఎలా ఇబ్బంది పెట్టారనే అంశాలను నియోజకవర్గ ప్రజలకు విన్నవిస్తున్నారు. ఈటల రాజేందర్ విజయాన్ని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈటల గెలుపు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మలుపు కాగలదని అంచనా వేస్తోంది.
అస్త్రశస్త్రాలతో తెరాస రెఢీ..
ఈటలను ఢీ కొట్టేందుకు తెరాస అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్(huzurabad by election 2021) బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. కొన్ని నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ఖరారవగా అతణ్ని ముందుకు నడిపిస్తూ హరీశ్‌రావు నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే జరగబోయే అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈటల రాజేందర్ తన స్వప్రయోజనాల కోసమే భాజపాలో చేరారని విమర్శిస్తున్నారు. కనీసం నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లను కట్టించలేకపోయారని హరీశ్‌రావు మాటల దాడికి దిగుతున్నారు. ఏ అవకాశాన్నీ చేజార్చుకోరాదని .. ఈటల వంటి బలమైన నేతను ఓడిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భాజపా ప్రభావం తగ్గించాలని గులాబీ దళం వ్యూహంగా ఉంది. అందులో భాగంగా ఎల్.రమణ, ఇ.పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితర నేతలను పార్టీలో చేర్చుకుంది. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి కేటాయించగా గవర్నర్ వద్ద పరిశీలనలో ఉంది.
దళిత బంధు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపఎన్నిక(huzurabad by election 2021)ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్దిదారుకు రూ.10 లక్షల రూపాయల ఆర్థికసాయం చేయడం ఈ పథకం ఉద్ధేశం. నియోజకవర్గంలోని దళితులందిరీకి ఉపాధి కల్పన కోసం రూ.10 లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేశారు. మరికొందరికి ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు తదితర యూనిట్లు పంపిణీ చేశారు. దళిత బంధు హుజురాబాద్ ఉపఎన్నిక కోసమేనంటూ విపక్షాలు విమర్శిస్తుండగా అలాంటి ఉద్దేశమే లేదని ప్రకటించిన ప్రభుత్వం మరో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజవర్గాల్లోనూ అమలు చేస్తోంది. పథకం రాష్ట్రమంతా అమలు చేయాలని.. ఎస్టీలు, బీసీలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, భాజపా ఆందోళనకు దిగాయి.
హోరాహోరీ పోరు
హుజురాబాద్ ఉపఎన్నిక(huzurabad by election 2021) తెరాస, భాజపా మధ్య హోరాహోరీగా సాగుతుండగా కాంగ్రెస్ పార్టీ ఇంకా రంగంలోకి దిగలేదు. అభ్యర్థిని ప్రకటించేందుకు ఆశావహుల వివరాలు సేకరించిన గాంధీభవన్ వాటిని అధిష్ఠానానికి పంపిస్తామని ప్రకటించింది. కొండా సురేఖ దాదాపు ఖరారయ్యాని ఊహాగానాలు వెలువడగా ఆమె ఇటీవలే ఆ విషయాన్ని ఖండించారు. తాను బరిలోకి దిగడం లేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక ఇంఛార్జిగా దామోదర రాజనర్సింహను నియమించారు. మండలాలకు బాధ్యుల నియామకం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి ఉపఎన్నిక జరగుతుండగా.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీకి సవాల్‌గా మారనుంది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని భాజపా చెబుతుండగా .. కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్ సిట్టింగ్ అభ్యర్థి కావడం వల్ల పోరు రసవత్తరం(Political Heat in Huzurabad)గా సాగనుంది.