శుద్ధి చేసిన తాగునీరు, అందుబాటులోనే బ్యాంకు సేవలు, విత్తనోత్పత్తిలో అనుభవం గడించిన రైతులు.. ఇలా సమగ్ర అభివృద్ధితో కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాలోనే తొలిసారిగా ఈగ్రామంలో భూగర్భ, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. సుమారు అయిదు వేల జనాభా కలిగిన వెలిచాలలో 12వందల ఇళ్లు, మూడు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు సమష్టిగా గ్రామసభల్లో నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
చీపుర్లు పట్టి శుభ్రం చేసి..
గ్రామాన్ని స్వచ్ఛభారత్‌లో భాగంగా పలు కాలనీలల్లో మురుగు కాలువలు శుభ్రం చేసి కాలనీల్లో ఉన్న చెత్తాచెదారాన్ని ఉరికి దూరంగా వేస్తున్నారు. పాఠశాలలు, విద్యాలయాల చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు తొలగించారు. కాలనీల్లో గుంతలమయంగా ఉన్నవాటిని మొరం తీసుకొచ్చి గుంతలు పూడుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇళ్ల చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అధికారులు ప్రజలను ఛైతన్య పరుస్తున్నారు.
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు...
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు, మరుగుదొడ్డి నిర్మాణం, మొక్కల పెంపకం, మంకీ ఫుడ్ కోర్ట్, సకల సౌకర్యాలతో కూడిన పంచాయతీ భవనం ఇలా అన్ని పనులు చేపడుతూ ప్రజల భాగస్వామ్యంతో పల్లెవాసులు ప్రగతి బాటలో నడుస్తున్నారు. చెత్త రహిత గ్రామంగా గుర్తింపు పొందేందుకు నిత్యం తమవంతుగా తడి, పొడి చెత్తను వేరుచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దశాబ్దాలుగా ఉనికి కోల్పోయిన పొలాల దారులను తాజాగా ప్రజల అభీష్టం మేరకు పునరుద్ధరించారు.
ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి