కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు.. అందుబాటులో ఉన్న అన్నీ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు గత ఆరేళ్లుగా ప్రైవేటు విభాగంలో కొనసాగుతున్న బస్‌పాసుల జారీ ప్రక్రియను ఆర్టీసీ తన అధీనంలోకి తీసుకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11చోట్ల ఈ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 32,000 ఉచిత పాసులతో పాటు 48,000 దివ్యాంగుల పాసులు, 3లక్షల నెలవారీ పాసులు జారీ చేసేవాళ్లమని.. వీటి వల్ల గత ఏడాది రూ. 3.36 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు చెప్పారు.
డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ
తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు డ్రైవింగ్ పాఠశాలలకు అనుమతి లభించిందని ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నైపుణ్యం గల డ్రైవర్ల కొరత ఉందని.. ఆర్టీసీలో శిక్షణ పొందిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అందుకే దరఖాస్తులు కూడా ముమ్మరంగా వస్తున్నాయని జీవన్ ప్రసాద్ చెప్పారు. 30 రోజుల శిక్షణకు అయ్యే రూ. 15,600 ఫీజును బీసీ,ఎస్సీ,మైనార్టీలకు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ మంత్రిని కోరినట్లు అధికారులు తెలిపారు.ఈ చర్యతో యువతకు నైపుణ్యంతో పాటు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుందని ఆర్‌ఎం వివరించారు.
కార్గోతో మెరుగు
సమ్మె అనంతరం కార్గో సేవలు ప్రారంభించిన ఆర్టీసీ అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందుతోంది. ప్రైవేటు కొరియర్లతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలు తక్కువ ఉన్నందున.. ప్రజలు కార్గోతో పాటు కొరియర్ సేవల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ సేవలను అప్పగించడం పట్ల మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా సర్వీసులు రద్దయ్యి తమకు డ్యూటీలు లభించని పరిస్థితి నుంచి కొరియర్,కార్గో కారణంగా చేతినిండా పనిదొరికిందని ఆనందపడుతున్నారు. కొరియర్, కార్గో వల్ల ఆర్టీసీకి రూ. 1.1 కోటి ఆదాయం సమకూరిందని.. రాబోయే రోజుల్లో మరింత ఆదాయం పెరిగే అవకాశముందని ఆర్‌ఎం వివరించారు.
ఇదీ చదవండిః నష్టనివారణ చర్యలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి