కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముందుగా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. మృతి చెందిన తెరాస కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మృతుడి పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకున్నారు.
కార్యకర్త కుటుంబానికి పరామర్శ..
రేణికుంట టోల్‌ప్లాజా వద్ద మంత్రి కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తిమ్మాపూర్ నుంచి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించాయి. గులాబీ శ్రేణుల నినాదాల మధ్య.. ర్యాలీగా బయలుదేరి మంత్రి కేటీఆర్ కరీంనగర్‌కు చేరుకున్నారు.
కరీంనగర్ దినదినాభివృద్ధి..
నగరంలో 24 గంటల నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించారు. కరీంనగర్ వచ్చిన ప్రతిసారి కొత్తగా ఉందని.. ఈ నగరం దినదినాభివృద్ధి చెందుతోందని కేటీఆర్ అన్నారు. నగరమంతా పచ్చదనంతో కళకళలాడుతోందని.. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడం చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపారు. నగర ప్రజలు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని.. మున్సిపల్ సిబ్బంది కూడా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచారని కొనియాడారు.
కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టు
కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ నాయకులను పోలీసు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ నగర అధ్యక్షుడు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను అదుపులో తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేరని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. నగరానికి రోజు విడిచి మరో రోజు నీటిని సరఫరా చేస్తున్నారని పార్టీ నగర అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయని పక్షంలో మంత్రులను కరీంనగర్ పట్టణంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
- ఇదీ చదవండి : ఇందిరాపార్క్ వద్ద భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష