కరీంనగర్ జూబ్లీనగర్ శివారులో రాత్రిపూట రహస్యంగా గుడుంబా తయారుచేస్తున్నారన్న పక్కాసమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తోన్న రెండు స్థావరాల్లో సుమారు ఐదు వందల లీటర్ల బెల్లం పానకంతో పాటు నలభై ఐదు లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వ నిషేధిత నాటుసారా, తాగే వారి ఆరోగ్యానికి చాలా హానికరమని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం తాత్కాలిక మధ్య నిషేధం విధించడాన్ని ఆసరాగా చేసుకుని రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు నిర్వహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.