హుజూరాబాద్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రేపు ఉదయం 7 గం. నుంచి రాత్రి 7 గం. వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు సీఈవో శశాంక్ గోయల్ వెల్లడించారు. దివ్యాంగుల కోసం వీల్‌ఛైర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా 32 మంది సూక్ష్మ పరిశీలకులు ఉన్నారని తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రత..
ఉప ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించినట్లు వివరించారు. ఈవీఎంల పరిశీలనకు అందుబాటులో ఆరుగురు ఇంజినీర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
డబ్బు పంపిణీ ఆరోపణలపై విచారణ..
ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని... కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.3.50 కోట్లు పట్టుబడినట్లు ప్రకటించారు. డబ్బు పంపిణీ ఆరోపణలపై ఎప్పటికప్పుడు విచారణ చేపట్టినట్లు తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఓటింగ్ శాతం పెరగాలని..
హుజూరాబాద్ శాసనసభ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో తెలిపారు. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరగాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. ఈ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కోసం కనీస సౌకర్యాలు కల్పించాము. 32మంది మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా 20 కంపెనీలకు చెందిన భద్రతా సిబ్బంది కేంద్రం నుంచి వచ్చారు. ఈ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నుంచి కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించాం. ఎన్నికల నియమావళి ప్రకారం ఏదైనా అవకతవక జరిగితే వాటిపై అధికారులు నిఘా పెట్టారు. ఈ ఫిర్యాదులపై చర్యలు కూడా తీసుకున్నాము.
- శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఇదీ చూడండి: Huzurabad: హుజూరాబాద్‌లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం: సీఈవో