కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన శ్యామల 3 నెలల క్రితం బంధువుల శుభకార్యానికి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోగా నిబంధనలు సడలించడం వల్ల నానాతంటాలు పడి ఇంటికి చేరింది. మూడు నెలల తర్వాత వచ్చిన తనను తనయుడు అక్కున చేర్చుకుంటాడేమోనని ఆశించిన ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది.
ఏడేళ్లుగా తన వద్దనే ఉంటున్న తల్లిని తమ్ముడు తీసుకెళ్లడం లేదన్న అక్కసుతో.. నర్సింహాచారి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఎండకు ఎండుతూ.. బిక్కుబిక్కుమంటూ గేటు బయటనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తల్లికి. తనకు కరోనా లేదు.. షోలాపూర్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన తర్వాతనే వచ్చానని కంటతడి పెట్టినా పట్టించుకోలేదు ఆ కసాయి కుమారుడు.
"షోలాపూర్ నుంచి రాత్రి బయలుదేరి.. పొద్దున ఆరు గంటలకు ఇక్కడికి వచ్చిన. నన్ను బయటే ఉంచి తాళం వేసుకున్నారు. వాళ్లకు నా వల్ల కరోనా వస్తదట. వాళ్లకు పిల్లలు ఉన్నరట. నాకేమైంది. నేను మంచిగనే ఉన్నా. అక్కడ షోలాపూర్‌లో పరీక్షలు చేశారు. నువ్వు మంచిగనే ఉన్నవ్.. పో.. అని డాక్టర్లు చెప్పారు."
-శ్యామల, వృద్ధురాలు
ఇది చూసి చలించిన స్థానికులు ఆ వృద్ధురాలికి అల్పాహారం అందించారు. స్థానిక తెరాస నాయకులు వచ్చి నర్సింహచారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అవసరమైన వైద్యపరీక్షలు చేయించాలే తప్ప మానవత్వం లేకుండా అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకొని.. శ్యామల కొడుకు, కోడలికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు