దేశంలో కొత్తగా 21 సైనిక్‌స్కూళ్లకు కేంద్ర రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు. అందులో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో నడుస్తున్న గురుకుల సైనిక్ పాఠశాల, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన రక్షణశాఖ 2022-23 విద్యాసంవత్సరానికి 21 పాఠశాలలకు అనుమతించింది.
ప్రవేశాలు ఇలా: ఈ పాఠశాలల్లో ప్రవేశాలు 6వ తరగతి నుంచి ప్రారంభమవుతాయి. 6వ తరగతిలో కనీసం 40% సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 60% సీట్లను అదే స్కూల్‌లో చదివి, సైనిక్‌స్కూల్‌లో చేరాలనుకున్న విద్యార్థులకు అర్హత పరీక్ష ద్వారా కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రత్యేకంగా విడుదల చేస్తారు. ఈ కొత్త స్కూళ్లలో విద్యాసంవత్సరం మే తొలివారం నుంచి ప్రారంభమవుతుంది. సైనిక్‌స్కూళ్ల అనుమతికి సంబంధించి మలిదశ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన పోర్టల్‌ను ఏప్రిల్ తొలివారంలో పునఃప్రారంభించనున్నారు. ఆసక్తి ఉన్న ప్రైవేటు స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలు ఇందుకు పోటీపడొచ్చు.
గుర్తింపుతో ప్రయోజనాలు: రుక్మాపూర్ పాఠశాలకు గత ఏడాది సీబీఎస్‌ఈ గుర్తింపు లభించింది. ఇప్పటికే సైనిక్ స్కూల్‌గా మంచి ఫలితాలు సాధిస్తోంది. తాజాగా రక్షణశాఖ గుర్తింపు రావడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చి వసతులు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. అంతేగాక ఇక్కడి సిబ్బందికి కేంద్ర బలగాలు బోధన, ఇతర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నాయి.
"కరీంనగర్‌లో ఒక సైనిక్‌స్కూల్ ఏర్పాటుచేయాలని కేంద్ర రక్షణమంత్రికి లేఖ రాశా. అధికారుల్ని పలుమార్లు కలిశా. నా కృషి ఫలించింది. రుక్మాపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇకపై కేంద్రరక్షణ శాఖ పరిధిలోకి వెళ్తుంది. మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌లకు కృతజ్ఞతలు."
- బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ
ఇదీ చదవండి: ఫలవంతంగా కేటీఆర్ అమెరికా పర్యటన.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..