రైలు సౌకర్యం అంతగా లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో కళకళలాడేవి. గతేడాది లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండగా రెండోదశ కొవిడ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు కళాశాలల మూతతోపాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దన్న ఆంక్షలతో బస్టాండ్‌లు ప్రయాణీకుల్లేక నిర్మానుష్యంగా మారాయి.
జంకుతున్న జనం
కరీంనగర్ రీజియన్ 10 డిపోల పరిధిలో 805 బస్సులు 3లక్షల 70వేల కిలోమీటర్లు తిరిగితే... రోజూ కోటి 20 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌తో గతేడాది మార్చి 22 నుంచి మే 18 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరిగి గాడిన పడుతున్న ఆర్టీసీ మరోసారి కొవిడ్ రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆదాయం సగానికి సగం పడిపోయింది. మహమ్మారి వ్యాప్తితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే జనం జంకుతున్నారు. ఫలితంగా పగలు తిరిగే బస్సులను రద్దుచేయాల్సి వస్తోంది. 10 నుంచి 15 మందితోనే బస్సు నడపాల్సివస్తోందని సిబ్బంది చెబుతున్నారు.
తగ్గిన ఆదాయం
ప్రయాణ ప్రాంగణాలు, బస్సులను శానిటైజేషన్ చేస్తున్నప్పటికీ ప్రయాణీకుల రాక అంతంతమాత్రంగానే ఉంది. కరీంనగర్ రీజియన్ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ఆర్టీసీ పరిస్థితి మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థితికి మారుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి : తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి: హరీశ్ రావు