Rajnath Singh Speech at BJP Jana Garjana Sabha : గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని.. ఇక్కడి ప్రజలను చూస్తుంటే రాజకీయ చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. రాణీ రుద్రమ, కుమురం భీం పుట్టిన గడ్డ తెలంగాణ అని కొనియాడారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి.. రెండోది తెలంగాణ నుంచి గెలిచామని కేంద్రమంత్రి గుర్తు చేశారు. గత 27 ఏళ్లుగా గుజరాత్ ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలంతా చూస్తున్నారన్నారు. కేవలం గుజరాత్ మాత్రమే కాకుండా దేశమంతా అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణాలో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన గర్జన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
BJP Public Meeting in Karimnagar : ఈ సందర్భంగా 2014లో ప్రజల ఒత్తిడికి తలొగ్గి.. కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. ఎలా అభివృద్ధి చెందుతున్నాయో ప్రజలు పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ ఒక లిమిటెడ్ కంపెనీలా.. ఒక కుటుంబ అభివృద్ధికి మాత్రమే దోహదపడుతోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరన్న రాజ్‌నాథ్‌సింగ్.. యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళితబంధు ఎంత మందికి ఇచ్చారో ప్రజలు ఆలోచించాలన్నారు.
ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే పార్టీ బీజేపీ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం కడతామని చెప్పి కట్టామన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పి చేశామని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా భూ రికార్డులు డిజిటలైజ్ చేసి.. పారదర్శకంగా సమాచారం అందించడమే కాకుండా రుణ సౌకర్యం పొందే సదుపాయం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలోనూ జరగాలంటే ఈసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే కారు బేకారు అయిపోయింది.. చేయి ప్రజలకు చెయ్యిచ్చిందని విమర్శించారు. మీ ఇళ్లకు లక్ష్మి ఎవరిదో చేయి పట్టుకొని రాదని.. కమలం పూవుపై కూర్చొని వస్తుందని గమనించాలని రాజ్‌నాథ్‌సింగ్ కోరారు.
BJP MP Aravind Fires on KCR Family : 'అవినీతి సొమ్మును రికవరీ చేసి మీ ముందు ఉంచుతాం'
దేశమంతా అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణలో మాత్రం అభివృద్ధి జరగడం లేదు. తెలంగాణ ఒక లిమిటెడ్ కంపెనీలా.. ఒక కుటుంబ అభివృద్ధికి మాత్రమే దోహదపడుతోంది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలంటే మీ సహకారం మాకు అవసరం. కారు బేకారు అయిపోయింది. చేయి ప్రజలకు చెయ్యిచ్చింది. ఈసారి మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. - రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి