కరీంనగర్ జిల్లా గంగాధరలోని మిషన్ భగీరథ కార్యాలయంలో గత నెల 23న చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 12 లక్షల విలువైన రాగి నల్లాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బత్తుల రమేశ్, రాజు, మహేశ్, రాకేశ్, మహేశ్, శేఖర్లుగా కరీంనగర్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. వీరిలో ఐదుగురు మహబూబాబాద్‌కు చెందిన వారు కాగా.. ఒకరు నర్సంపేటకు చెందిన వ్యక్తిగా ఆయన తెలిపారు.
ఫిబ్రవరి 23న గంగాధరలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రూ.12 లక్షల 20 వేల విలువ చేసే రాగి నల్లాలు చోరీకి గురయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మిషన్ భగీరథ కూలీలే చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఫుటేజీతో గుర్తించారు.
చోరీ చేసిన నల్లాలను శనివారం విక్రయిస్తుండగా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గంగాధర పోలీసులను డీసీపీ చంద్రమోహన్ అభినందించారు.
ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!