దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల పన్నుల వసూళ్లు వాయిదా పడ్డాయి. ఈనెల తొలివారం నుంచి సర్కార్ సడలింపులు ఇవ్వటంతో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ పన్నుల చెల్లింపునకు ఈనెల 31 తుదిగడువు ప్రకటించడం వల్ల బకాయిలు చెల్లించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 71వేల 169 ఇళ్లు ఉన్నాయి. ఆస్తిపన్ను డిమాండ్ 26.09 కోట్లు కాగా.. లాక్‌డౌన్ పూర్తి అయ్యేనాటికి 20 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి.
5 శాతం రాయితీ
వచ్చే ఆర్థిక సంవత్సరానికి పన్నుచెల్లించే వారికి నగరపాలక సంస్థ 5 శాతం రాయితీ సహా లక్కీడ్రా సదుపాయం కల్పించడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు పన్ను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు శుక్రవారం ఒక్కరోజే 78 లక్షల పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. రాయితీ కల్పించడంపై నగరవాసులు నగరపాలక సంస్థకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
గడువు దగ్గర పడుతుండడం వల్ల అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కార్యాలయానికి వస్తున్నారు. చెల్లింపుదారులు పెరుగుతుండటంతో ఒక్కొక్కరికి చాలా సమయం పడుతోందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటించేందుకు వీలుగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆదివారం కూడా పన్నుల స్వీకరణ
ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన కమిషనర్ క్రాంతి.... మొత్తం 17 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని.. ఆదివారం సెలవు రోజైనా పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు స్పష్టంచేశారు. గడువు చివరివరకు వేచి చూడకుండా... ముందుగానే చెల్లించాలని కమిషనర్ సూచించారు. గడువు తర్వాత పన్ను చెల్లించని వారిపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని వినియోగిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'