కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామాల్లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వల్ల రైతుల్లో ఆందోళన చోటుచేసుకుంది. వానా కాలం సమీపించడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతుందని భయానికి గురవుతున్నారు. నెల రోజులుగా తూకం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు.
చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నెల రోజుల క్రితం మొదలుపెట్టిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యత లేదని మిల్లర్ల అభ్యంతరాలతో కొన్ని రోజులు ప్రతిష్టంభన నెలకొంది. ధాన్యం తూకం అనంతరం రైస్ మిల్లర్లు లెక్కింపులో కోత విధించడంతో రైతులు వ్యతిరేకించారు.
అదే సమయంలో హమాలీలు, లారీల కొరత మూలంగా ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. దీనివల్ల వేలాది క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడం సమస్యగా మారింది. నెలల తరబడి వరి ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటోంది. వానకాలం సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు కొనుగోళ్లు ముమ్మరం చేయాలని.. లేకపోతే తాము ఆరుగాలం పడిన కష్టమంతా నీటిలో కొట్టుకుపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.