ఆకర్షణీయ నగరాల జాబితాలో ఉన్న కరీంనగర్ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముమ్మరంగా నిధులను కేటాయిస్తోంది. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల రూ.2.40 కోట్లు అందజేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన నగరపాలక సంస్థ వారి కోసం ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వాక్ ట్రాక్‌లు
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మైదానాల్లో ప్రత్యేకంగా కాలినడక కోసం ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్న వైద్యుల సూచన మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది కరీంనగర్ నగరపాలిక. ప్రజలు నుంచి వచ్చిన సూచనల మేరకు నగరంలోని ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక అమలు చేస్తోంది.
30 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లు
పట్టణ ప్రగతిలో అధిక శాతం నిధులు ప్రజలకు ఆహ్లాదం కలిగించే అంశాలకే కేటాయిస్తున్నట్లు మేయర్ సునీల్ రావు చెప్పారు. నగరంలో 60 డివిజన్లు ఉండగా తొలుత 30డివిజన్లలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామని వెల్లడించారు. ఒక్కో ఓపెన్ జిమ్‌కు దాదాపు 12లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు వివరించారు.
ప్రత్యేక దృష్టి
ప్రజల ఆరోగ్యం కోసం నగరపాలిక ఏర్పాటు చేస్తున్న వ్యాయామశాలల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన జిమ్‌లు సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్నందున ఈసారి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఓపెన్ జిమ్‌లలో ఓరుగల్లు మహిళల కసరత్తులు