కరీంనగర్ ప్రజలు కరోనా భయం నుంచి తేరుకుంటున్నారు. మార్చి 17న కరీంనగర్‌లో తొలి కరోనా కేసు నమోదవడం వల్ల జనం ఉలిక్కిపడ్డారు. మరో వారంలోనే కేసుల సంఖ్య 14కి పెరగడం కలకలం రేపింది. అందులో ఒక్కరోజే 8 మందికి పాజిటివ్ అని తేలడం.. ప్రజల్లో వణుకు పుట్టించింది.
మొత్తం 18 కరోనా పాజిటివ్ కేసులు
కానీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకున్నారు. ఐసోలేషన్‌లో ఉన్న 119 మందిని ఇళ్లకు పంపించిడమే కాకుండా.. హుజూరాబాద్‌లో 26 మందికి నెగెటివ్ రావడం వల్ల స్వీయ క్వారంటైన్‌లో ఉండమని అధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గాంధీ ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఇందులో దిల్లీ సభలకు వెళ్లి వచ్చిన వాళ్లు ముగ్గురు కాగా.. వారిలో ఒకరి నుంచి అతడి సోదరుడికి సోకింది. మిగతా ముగ్గురు కరీంనగర్ వాసులు.
మార్చి 14న కరీంనగర్‌కు ఇండోనేసియన్లు
మార్చి 14న ఇండోనేషియన్లు కరీంనగర్‌కు చేరుకున్న నాటి నుంచి.. వారిని గుర్తించి ఆస్పత్రికి పంపించే వరకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. వాళ్లు ఎక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేపట్టి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండోనేషియన్లు కలిశారని అనుమానమున్న 82 మందిని తొలుత మార్చి 17న ఐసోలేషన్ వార్డులకు తరలించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
150 ప్రత్యేక బృందాలు
అన్నివైపులా దారుల్ని మూసి వేసి సుమారు 4 వేల కుటుంబాలను ఇళ్లకే పరిమితం చేశారు. ప్రజల రాకపోకల్ని నిలువరించారు. 150 ప్రత్యేక బృందాలు నగరంలో ప్రభావమున్న 36 వేల74 ఇళ్లలోని 1 లక్షా 36 వేల 348 మంది ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించాయి. జ్వరం, జలుబు ఇతర లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమైన మందులిచ్చి జాగ్రత్తలు చెప్పారు.
ఇంటికి ఇద్దరు చొప్పున అధికారులు
నగరంతోపాటు జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన స్థానికులు 622 మందిని గుర్తించి వారికి హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేశారు. వాళ్ల ఇళ్ల వద్ద ప్రత్యేకంగా సూచనలతో బోర్డును ఏర్పాటు చేశారు. బయటకు రాకుండా చూసేలా ఇంటికి ఇద్దరు చొప్పున అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జనతా కర్ఫ్యూ కంటే ముందే ఇక్కడ నిర్బంధ కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తున్నారు. రాష్ట్రమంతా రాత్రి 7 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలైతే.. కరీంనగర్‌లో అంతకన్నా ఎక్కువ సమయం అమలు చేస్తూ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉదయం 6 నుంచి 9 గంటల వరకు
మొదట్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మూడు గంటలే సడలింపు ఇచ్చారు. ఇటీవల మరో మూడు గంటలు పెంచారు. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బయటకు రాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేశారు. డ్రోన్‌తోపాటు పవర్‌స్ప్రేలు, అగ్నిమాపక శకటాలతో రసాయన ద్రావణాల్ని చల్లారు. ప్రజల్లో అవగాహనకు రెండు కాల్ సెంటర్లు నెలకొల్పారు. నగరం చుట్టూ 16 చెక్‌పోస్టులు పెట్టి ఎవరినీ నగరంలోకి అనుమతించడంలేదు.
నిబంధనలు ఉల్లంఘించొద్దు
కొత్త కేసులు నమోదు కానంత మాత్రాన ఊపిరి పీల్చుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. మరో ఐదుగురి నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వేములవాడలో తొలుత ఓ వ్యక్తికి నెగిటివ్ రావడం.. ఆ తర్వాత 21రోజులకు పాజిటివ్ రావడం వల్ల మరింత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ నిబంధనలను ఉల్లంఘించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం