Multipurpose Eco friendly Agro Machine: నేటి కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల ప్రతి రంగంలో యాంత్రిక వినియోగం సాధారణం అయిపోయింది. దీనికి వ్యయసాయం మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు భూమి దున్నాలంటే నాగలి ఉపయోగించేవారు. వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. పంట పండిన తర్వాత దాన్ని మనుషులే కోసే వాళ్లు. తర్వాతి కాలంలో వరికోత యంత్రాలు (హార్వెస్టింగ్ మిషన్స్) పుట్టుకొచ్చాయి.
Student designs Multipurpose Eco friendly Agro Machine : వరి, గోధుమ పంట నూర్చడానికి పెద్ద రైతులంతా భారీ యంత్రాలు ఊపయోగిస్తుంటే.. చిన్న, సన్నకారు రైతు మాత్రం తగిన ఆర్థిక స్థోమత లేక వాటిని వాడటం లేదు. కరీంనగర్ కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంది. తన కుటుంబం పడుతున్న కష్టాలు చూడలేక శుభ శ్రీ అనే విద్యార్థి మల్టీ పర్పస్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మిషన్‌ను రూపొందించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
కరీంనగర్ పారామిత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శుభశ్రీ సాహు వారి కోయడం, వడ్లు, బియ్యం వేరు చేయడం లాంటి మల్టీ పర్పస్ యంత్రాన్ని కనుక్కుంది. ఈ ప్రాజెక్టును సీబీఎస్ఈ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ 2022-23లో ప్రదర్శించి విజేతగా నిలిచింది. జాతీయ స్థాయిలో సీబీఎస్సీ పాఠశాలల్లో “పర్యావరణ” విభాగంలో ఆమె రూపొందించిన నమూనా ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది.
వేసవి సెలవుల్లో ఒడిశాలోని తమ సొంతూరుకు వెళ్లినప్పుడు శుభశ్రీ ఈ కష్టాలను గుర్తించింది. వరి కోసం చేనులో పంజగొట్టడం,ఎద్దులతో బంతి కొట్టించి గింజలు వేరు చేయడం.. తర్వాత వాటిని తూర్పార పట్టేటప్పుడు దుమ్మూదూళి నోరు, ముక్కు లోపలికి వెళ్లి అనారోగ్యం పాలవడం వంటి అంశాల్ని గమనించింది. వారికి సాయం చేసేందుకు తన వంతు ప్రయత్నంగా ఈ యంత్రాన్ని కనుక్కుంది. శుభశ్రీ తండ్రి లలిత్ మోహన్ సాహు.. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన ప్రాజెక్టు రూపకల్పనలో సలహాలు సూచనలు ఇచ్చారు.
రైతుల ప్రయోజనం కోసం ఆమె రూపొందించిన “మల్టీ పర్పస్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మెషిన్” ద్వారా అనేక పనులు చేసుకోవచ్చు. కోసిన వరిని ఈ మిషన్లో వేస్తే... వడ్లను వేరు చేయవచ్చు. ఇలా చేసే క్రమంలో ధాన్యం పూర్తిగా వరి నుంచి వేరుగా పడుతుంది. అందులోని దుమ్ము దూళి మిషన్ లోనే వేరు పడిపోతుంది. ఇదే తరహాలో గోదుమ పంట కోసి మిషన్లో వేస్తే గోధుమలు, అందులోని గడ్డి వేరేగా వేర్వేరు అవుతాయి. ఇలా వచ్చిన ధాన్యాన్ని లేదా గోధుమలు సంచుల్లో నింపి.. ఇదేమిషన్ పై కుట్టు వేసే సౌకర్యం కూడా ఇందులోనే ఉంటుంది.
అంతేకాకుండా ధాన్యం, గోధుమలు వేరు చేసిన తర్వాత వచ్చిన గడ్డిని ఇదే మిషన్లో వేస్తే.. పశువుల మేతకు కావాల్సిన విధంగా కట్ చేస్ చాపర్ లాగా సైతం దీన్ని వాడుకోవచ్చు. కూరగాయలు, పండ్లు లాంటివి వేస్తే పశువులు మేసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. ఇలా అనేక రకాల పనులు చేసి పెట్టే ఈ యంత్రానికి ఎలాంటి ఇంధనమూ అవసరం లేదు. ఈ యంత్రం నడిచేందుకు వీలుగా అమర్చిన మోటార్లు రన్ కావాడనికి సోలార్ ఎనర్జీని వాడుకునే ఏర్పాటు చేశారు. యంత్రం పై భాగంలో అమర్చిన సోలార్ ప్లేట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుతో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇది చిన్నగా ఉండటం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉందని శుభశ్రీ, ఆమెకు గైడుగా పనిచేసిన తండ్రి లలిత్ మోహన్ సాహు చెప్పారు.
ఇందులో ఉపయోగించిన పరికరాలన్నీ కూడా బయట సులభంగా దొరికేవే కావటం మరో విశేషం. ప్రస్తుతం ఈ యంత్రాన్ని తయారు చేయడానికి రూ.15 వేలు ఖర్చు అయింది. అధిక సంఖ్యలో ఇలాంటి యంత్రాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే కేవలం రూ.5 వేలతోనే అందించవచ్చని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో దీనికి అదనంగా బరువు తూచే,ఇతర అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని శుభ శ్రీ తెలిపింది. మరోవైపు ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు తీసుకొనేందుకు యత్నిస్తామని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
ఇవీ చదవండి: