Mountaineer Rohit: రోహిత్ వాళ్ల నాన్న పేరు శ్రీనివాసరావు. పారా గేమ్స్‌లో ఏ ఆట ఆడినా అందులో శ్రీనివాస రావు కచ్చితంగా కప్పు గెలుచుకునేవాడు. పారావీల్ ఛైర్ టెన్నీస్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడటంలో అతను దిట్ట. 2004లో అర్జున అవార్టు కూడా సాధించాడు. 2010లో ఆసియన్ పారా, కామన్ వెల్త్ గేమ్స్‌లోను పాల్గొన్నాడు. కానీ 2021లో లంగ్ క్యాన్సర్‌తో శ్రీనినాస రావు చనిపోయారు. తన తండ్రినే స్పూర్తిగా తీసుకున్న రోహిత్... అతని కోసం ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు.
రోహిత్‌కి చిన్నప్పటి నుంచి పర్వతాలు అధిరోహించడం అంటే చాలా ఇష్టం. అందులోను మంచు పర్వతాలు అంటే మరీ ఇష్టం. ఎప్పటికైనా ఇటువంటి పర్వతాలు ఎక్కాలనే కోరిక అతని మనసులో నాటుకుపోయింది. ఆ దిశగానే అడుగులు వేస్తూ 2018 నుంచి పర్వతాలు అధిరోహిస్తున్నాడు. అందుకే తండ్రి కోసం ఎవరెస్టు శిఖరం ఎక్కాలనే లక్ష్యం పెట్టుకుని సాధన చేస్తున్నాడు.
"నాకు చిన్నప్పటి నుంచి మంచు పర్వతాలు ఎక్కాలని చాలా ఇష్టం ఉండేది. సమాచారం కోసం అంతర్జాలంలో పరిశీలించాను. ఎటువంటి 2018 వరకు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఈ విషయంలో నా తండ్రి నాకు స్ఫూర్తి. స్పోర్ట్స్ విషయంలో నాకు చాలా మద్దతు ఇచ్చారు. ఏడాది క్రితం లంగ్ క్యాన్సర్‌తో ఆయన చనిపోయారు. ఆయన కోసమే నేను ఎవరెస్ట్ అధిరోహించి.. ఆ విజయాన్ని నా తండ్రికి అంకితమివ్వాలని నిర్ణయించుకున్నాను." -రోహిత్, పర్వతారోహకుడు
రోహిత్ ప్రస్తుతం ఓ ప్రముఖ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్‌లో విశ్లేషకునిగా పనిచేస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పర్వతాలు అధిరోహిస్తున్నాడు. వాస్తవానికి ఎవరెస్టు అధిరోహించడం రోహిత్ లక్ష్యం కాదు. కానీ అతని తండ్రి చనిపోవడంతో ఎంతటి కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ఎవరెస్టు అధిరోహించి.. వాళ్ల నాన్నకు అంకితం ఇవ్వాలని లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. పర్వతారోహణకు అవసరమైన సమాచారాన్ని రోహిత్ ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాడు. నిపుణులను సంప్రదిస్తున్నాడు. ఓపికతో అందులోని మెళకువలు నేర్చుకుంటున్నాడు. కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదని.. తన తండ్రి చెప్పిన మాటల్ని రోహిత్ ఎప్పటికీ గుర్తుచేసుకుంటాడు. ఆ దిశగానే కఠోర సాధన చేస్తున్నాడు.
రోహిత్ 2018 డిసెంబర్‌లో 3,810 మీటర్ల ఎత్తైన ఉత్తరాఖండ్ కేదరికాంత్ పర్వతాన్ని అధిరోహించాడు. 2019 మే లో 4,575 మీటర్ల పంగరిచుసల్లా పర్వతాన్ని అధిరోహించాడు. బ్రహ్మథాల్, డయారా బుగ్జాల్.. అలాగే 2021లో లద్దాఖ్‌లోని 6,240 మీటర్ల ఎత్తయిన డీజో జోంగో పర్వతాలను ఎక్కేసాడు. ఇప్పటివరకు ఇలా సుమారు ఏడు ట్రెక్కింగ్‌లు చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న రోహిత్ ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద జాతీయ జెండాను రెపరెపలాడించాడు. పర్వాతరోహణలో రోహిత్ 20 వేల అడుగులు అధిరోహించిన క్లబ్‌లోకి చేరాడు. ఇప్పటివరకు రోహిత్ తన సొంత ఖర్చులతోనే ట్రెక్కింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రభుత్వం నుంచి శిక్షణ పరంగా, ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడు రోహిత్.
రోహిత్ తన ఫిట్‌నెస్ కోల్పోకుండా ఉండేందుకు సైక్లింగ్ చేస్తుంటాడు. త్వరలోనే జమ్మూకాశ్మీర్ పరిసర ప్రాంతాల్లోని మౌంట్ నున్ పర్వతాన్ని అధిరోహించనున్నట్లు తెలిపాడు. దానికి సుమారు 50 లక్షల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నాడు. 2024 నాటికి ఎలాగైనా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. తన తండ్రికి అంకితమిస్తానంటున్నాడు రోహిత్.
ఇవీ చదవండి: రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసిన గాయత్రి రవి
మీ రాజకీయాల కోసం నా నోట్లో మట్టి కొట్టొద్దు: కిన్నెర మొగిలయ్య